Janasena Responds over attack on Sai Dharam Tej: పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మద్దతుగా నటుడు సాయి ధరమ్ తేజ్ చేస్తున్న ఎన్నికల ప్రచారంలో ఆయనపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. స్థానిక వైఎస్ఆర్ సీపీ నాయకులు సాయి ధరమ్ తేజ్ పై దాడి చేసినట్లుగా భావిస్తున్నారు. ఈ వ్యవహారంపై జనసేన పార్టీ స్పందించింది. సాయి ధరమ్ తేజ్ పై దాడి ప్రయత్నాన్ని ఖండిస్తున్నామని జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. వైసీపీ మార్కు రౌడీయిజంతో బెదిరించాలని చూస్తే ఉపేక్షించేది లేదని వార్నింగ్ ఇచ్చింది. ఈ ఘటనలో జన సైనికుడు శ్రీధర్ తలకు గాయం కావడం బాధాకరం అని.. పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీధర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నామని జనసేన పార్టీ తెలిపింది.


‘‘పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం తాటిప్రత్తి గ్రామంలో ఆదివారం సాయంత్రం ఎన్నికల ప్రచారం చేస్తున్న సందర్భంలో శ్రీ సాయి ధరమ్ తేజ్ గారిపై వైసీపీ రౌడీ మూకలు దాడి చేసే ప్రయత్నానికి పాల్పడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వైసీపీ మూకలు విసిరిన గాజు ముక్కలు తగిలి స్థానిక జన సైనికుడు శ్రీధర్ తలకు తీవ్రమైన గాయం కావడం చాలా బాధాకరం. పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీధర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం. జనసేన పార్టీ ర్యాలీ సందర్భంలో వైసీపీ రౌడీలు ఘర్షణ వాతావరణం సృష్టించి జన సైనికులను భయాందోళనలకు గురి చేసేందుకు రాళ్లు, గాజు సీసాలు విసిరే ప్రయత్నం చేశారు. 


జనసేన పార్టీ చేస్తున్న ర్యాలిలోకి వైసీపీ రౌడీ మూకలు చొచ్చుకొని రావడం, వైసీపీ జెండాలు ప్రదర్శిస్తూ జన సైనికులపై కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నా స్థానిక పోలీస్ అధికారులు వారిపై చర్యలు తీసుకోకపోవడం ఎంతవరకు సమంజసం..? వైసీపీ మార్కు రౌడీయిజంతో బెదిరించాలని చూస్తే ఉపేక్షించేది లేదు. ప్రజలు భయాందోళనలకు గురి కాకుండా ఎన్నికలు సజావుగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ అధికారులను కోరుతున్నాం’’ అని జనసేన పార్టీ ప్రకటన విడుదల చేసింది.