AP Government Whip Resignation: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నైతిక విలువల విషయంలో జనసేనాని పవన్ కళ్యాణ్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనపై వచ్చిన వ్యక్తిగత ఆరోపణల కారణంగా రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ శనివారం తన ప్రభుత్వ విప్ పదవికి రాజీనామా చేశారు. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో పవన్ కళ్యాణ్‌తో భేటీ అయిన ఆయన, తన రాజీనామా పత్రాన్ని అందజేశారు.

Continues below advertisement

వివాదం ఏమిటి?    

రైల్వే కోడూరు నియోజకవర్గానికి చెందిన ఒక మహిళా ప్రభుత్వ ఉద్యోగి, ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనను లైంగికంగా వేధిస్తున్నారని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఈ ఉదంతం రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టించింది. పార్టీ ప్రతిష్టను కాపాడే క్రమంలో పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించి, ముగ్గురు సభ్యులతో కూడిన ఒక అంతర్గత కమిటీని ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించారు. ఈ కమిటీ నివేదిక ఆధారంగా, విచారణ ముగిసేవరకు పదవి నుంచి తప్పుకోవాలని అధిష్టానం సూచించినట్లు తెలుస్తోంది.

Continues below advertisement

 పవన్ కళ్యాణ్ ముందు హనీట్రాప్  వాదన! 

పవన్ కళ్యాణ్‌తో జరిగిన అంతర్గత భేటీలో అరవ శ్రీధర్ తన వివరణ ఇచ్చుకున్నారు. సదరు మహిళతో తనకు పాత పరిచయం ఉన్న మాట వాస్తవమేనని అంగీకరిస్తూనే, ఇదంతా తనపై జరిగిన రాజకీయ కుట్ర అని ఆయన వాదించారు. కొంతకాలంగా ఆమె తనను డబ్బు కోసం బ్లాక్‌మెయిల్ చేస్తోందని ఎమ్మెల్యే ఆరోపించారు.  స్థానిక రాజకీయ ప్రత్యర్థులు కలిసి తన్ను రాజకీయంగా దెబ్బతీయడానికి పన్నిన 'హనీట్రాప్' కుట్ర ఇదని చెబుతూ, దానికి సంబంధించిన కొన్ని కీలక డిజిటల్ డాక్యుమెంట్లు, ఆధారాలను పవన్ కళ్యాణ్ ముందు ఉంచినట్లు సమాచారం.  

 నైతికతకు పవన్ పెద్దపీట 

 తప్పు చేస్తే సొంత పార్టీ వారినైనా ఉపేక్షించేది లేదు  అని గతంలోనే పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఆ మాట ప్రకారమే, ఆరోపణలు వచ్చిన వెంటనే పదవి నుంచి దూరం పెట్టి ప్రజల్లోకి ఒక బలమైన నైతిక సందేశాన్ని పంపారు. నిప్పులాంటి నిజం తేలేవరకు పదవిలో ఉండటం సముచితం కాదని భావించే రాజీనామా చేస్తున్నట్లు అరవ శ్రీధర్ మీడియాకు వెల్లడించారు. వైఎస్సార్ జిల్లాలో జనసేనకు బలమైన పునాది వేసిన నేతల్లో శ్రీధర్ ఒకరు. అయితే, మహిళా ఉద్యోగి ఆరోపణలు పార్టీకి కొంత ఇబ్బందికరంగా మారాయి. ఇప్పుడు రాజీనామా చేయించడం ద్వారా ప్రతిపక్షాలకు విమర్శించే అవకాశం ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ జాగ్రత్త పడ్డారు. నిష్పక్షపాతంగా విచారణ జరిపి నిజానిజాలు బయటపెట్టాలని పోలీసులకు కూడా పార్టీ సూచించింది.