Railwaykoduru Crime News: రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని పోరాటం చేస్తున్న మహిళపై భౌతిక దాడి జరిగింది. ఈ ఉదయం ఆమె టీడీపీ ఆఫీస్‌కు వెళ్లి అక్కడ గ్రీవెన్స్‌లో అరవ శ్రీధర్‌పై ఫిర్యాదు చేశారు. కేసు నడుస్తున్నా ఇంత వరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించలేదని ఆమె టీడీపీ నేతలకు ఫిర్యాదు చేశారు. ఇలా ఫిర్యాదు చేసిన సాయంత్రానికి ఆమెపై దాడి జరగడం సంచలనంగా మారింది. ఆమెతోపాటు ఈ కేసులో వాదిస్తున్న లాయర్‌ సోదరుడిపై కూడా దాడి చేశారు. దీంతో వారిద్దరు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.   

జనసేన ఎమ్మల్యేపై ఆరోపణలు చేసిన మహిళ, తన లాయర్ ఆజాద్ తమ్ముడైన గోపితో కలిసి రైల్వేకోడూరు పట్టణంలోని గాంధీ విగ్రహం సమీపంలో పూజా సామాగ్రి కోసం వచ్చింది. అక్కడే రాజధాని అమరావతి పార్లమెంటులో ఆమోదం పొందిన సందర్భంగా సంబరాలు నిర్వహించడానికి జనసేన నాయకులు, కార్యకర్తలు ఏర్పాట్లు చేశారు. అక్కడకు వచ్చిన మహిళను చూసిన జనసేన లీడర్ తాతంశెట్టి నాగేంద్ర మరికొందరు గోపీపై దాడి చేశారు. ఎందుకు దాడి చేస్తున్నారని బాధితురాలు ప్రశ్నించారు. దీంతో ఆమెపై కూడా దాడి చేసినట్టు ఆరోపిస్తున్నారు.

దాడికి గురైన బాధితారులు గోపీ స్థానిక పోలీస్ స్టేషన్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారిస్తున్నారు. అరవ శ్రీధర్ విషయంలో ఇబ్బంది పెడుతున్నాననే ఇలాంటి దాడులతో భయపెట్టాలని చూస్తున్నారని బాధితురాలు చెబుతున్నారు. ఇకపై తాను బహిరంగంగా తిరగలేనని ఇలా భయపెడితే పారిపోతానని అనుకుంటున్నారేమో తాను బెదిరే రకం కాదని అన్నారు. వాళ్ల ఎదుటే ధైర్యంగా తల ఎత్తుకొని తిరుగుతానని చెప్పారు. వారిపై వేసిన కేసులు గెలిచి తీరుతానని శపథం చేశారు. 

రైల్వేకోడూరులో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న మహిళ తనను ఎమ్మెల్యే ఏడాదిన్నరగా లోబరుచుకొని పెళ్లి చేసుకుంటాని నమ్మించి మోసం చేశారని ఆరోపించారు. జనవరిలో ఆమె విడుదల చేసిన సెల్ఫీ వీడియోతో విషయం వెలుగులోకి వచ్చింది. తనను ఉద్యోగ రీత్యా సాయం చేస్తానని నమ్మించి రాజకీయాధికారంతో భయపెట్టి తనపై దాడి చేస్తూ వచ్చాడని పేర్కొన్నారు.  

బాధితురాలి కథనం ప్రకారం ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ ఆమె పరిచయం 2024 జూన్ 14న టెలిగ్రామ్‌లో పరిచయం అయ్యారని పేర్కొన్నారు. ఆ సమయంలో ఆమె తన ఉద్యోగ బదిలీ, ఇతర సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యేను ఆశ్రయించానని తెలిపారు. ఎమ్మెల్యే తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి శారీరక సంబంధం పెట్టుకున్నారని అన్నారు. ఐదు సార్లు అబార్షన్లు చేయించాలని తెలిపారు. చెప్పినట్టు వినకుంటే ఉద్యోగం నుంచి తొలగిస్తానని, శాఖాపరమైన చర్యలు తీసుకుంటానంటూ బెదిరించే వారని ఆరోపించారు. తన కుటుంబంలో కూడా విభేదాలు సృష్టించి విడాకులు తీసుకునేలా ఒత్తిడి చేసినట్టు పేర్కొన్నారు. 

ఇలా ఆరోపణలు చేయడమే కాకుండా ఇద్దరి మధ్య జరిగిన సోషల్ మీడియా చాటింగ్‌లు, ఫొటోలను బాధితులు బహిర్గతం చేయడంతో ఎమ్మెల్యేపై విమర్శలు ఎక్కువయ్యాయి. విషయాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్‌ వరకు కూడా కేసుల వెళ్లింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

ఎమ్మెల్యేపై వచ్చిన ఆరోపణలపై జనసేన పార్టీ కూడా చర్యలు తీసుకుంది. అసలు విషయం తేలే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. వాస్తవాలు తేల్చేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఏం తేల్చిందో చెప్పాలని బాధితురాలు ఈ మధ్య వీడియో విడుదల చేశారు. తనకు న్యాయం చేయకుంటే జనసేన ఆఫీస్‌ ముందు ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించారు. ఇంతలో ఆమెపై దాడి జరగడం సంచలనంగా మారింది.