Janasena News: తెలంగాణలో తనకు ఓటు ఉందని, ఏపీలో కూడా ఓటుకు దరఖాస్తు చేసుకున్నానంటూ ఓ కామెడీ పత్రిక తనపై వార్తలిచ్చిందంటూ పరోక్షంగా సాక్షిపై సెటైర్లు వేశారు నాగబాబు. అయితే వారు ప్రచురించినట్టుగా తనకు ఖైరతాబాద్ లో ఓటు లేదని, ఫిలింనగర్ లో ఉందని వివరణ ఇచ్చారు. ఓటు హక్కు ఉన్నా కూడా తను కానీ, తన కుటుంబ సభ్యులు కానీ ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయలేదని చెప్పారు. ఏపీలో ఓటు హక్కు నమోదు చేయించుకోడానికే తాము అక్కడ ఓటు వేయలేదన్నారు.
తెలంగాణలో ఓటు వేయకుండా ఇక్కడ నమోదు చేయించుకోడానికి తాము సిద్ధపడితే.. దాన్ని కూడా రాజకీయం చేశారంటూ విమర్శించారు నాగబాబు. మంగళగిరిలో తాను, తన కుటుంబ సభ్యులు ఓటు నమోదుకోసం ప్రయత్నిస్తే అధికారులు అడ్డుకున్నారని చెప్పారు. హైదరాబాద్ లో ఉన్న ఓటుని తాము రద్దు చేసుకున్నామని ఏపీలోనే తాము ఓటు వేస్తామంటున్నారాయన.
నెల్లూరు జిల్లాలో పోటీ చేస్తాం..
నెల్లూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నాయకులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు. నెల్లూరు జిల్లాలో తాము పోటీ చేస్తామన్నారు. ఇదేమన్నా శ్రీలంకలో ఉందా, భారత దేశంలోనే ఉంది కదా, మేమెందుకు పోటీ చేయకూడదు అని విలేకరులను ప్రశ్నించారు. నెల్లూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నాయకులతో స్థానిక పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు నాగబాబు. అక్కడ పార్టీ ఎలా ఉంది, పొత్తుల్లో ఏయే నియోజకవర్గాలు అడగొచ్చు అనే వివరాలను నాయకుల దగ్గర సేకరించారు.
నేను పోటీ చేయను..
ప్రత్యక్ష ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని క్లారిటీ ఇచ్చారు నాగబాబు. తాను కానీ, అజయ్ కానీ.. ఎన్నికల్లో పోటీ చేయట్లేదని, తాము వెనక ఉండి యువతరాన్ని ప్రోత్సహిస్తామన్నారు. ఎన్నికల్లో పోటీకి యువకులకు అవకాశమిస్తామన్నారు. తనకు పదవులపై ఆశలేదని చెప్పారు నాగబాబు. పార్టీని బలోపేతం చేయడానికే తాము కృషి చేస్తున్నట్టు చెప్పారు.
నెల్లూరు జిల్లాలో మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి ఆధ్వర్యంలోనే క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని ఆరోపించారు నాగబాబు. కాకాణి అక్రమాలకు రెవెన్యూ అధికారులు, పోలీసులు వంతపాడుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో అధికార పార్టీ నేతల కనుసన్నల్లో అనేక అక్రమాలు జరుగుతున్నాయన్నారు నాగబాబు. వచ్చే ఎన్నికల్లో జనసేన-టీడీపీ పొత్తు విజయం సాధిస్తుందన్నారు.
వైనాట్ 175 అని వైసీపీ వాళ్లు అంటున్నారని, తాము వై నాట్ వైసీపీ జీరో అని అంటున్నారమని.. వైసీపీకి జీరో ఎందుకు రాకూడదు అని ప్రశ్నించారు నాగబాబు. నిజమైన నాయకుడు ప్రతిపక్షం ఉండకూడదు అనే ఆలోచన చేయడని, అలాంటి వారు నాయకుడు కాదని, నియంత అవుతాడని పరోక్షంగా జగన్ ని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షం ఉండకూడదని జగన్ కోరుకుంటున్నారని, అది మంచి సంప్రదాయం కాదన్నారు. వైసీపీ 20 - 25 సీట్లతో ప్రతిపక్షంలో ఉండాలని తాము కోరుకుంటున్నట్టు తెలిపారు నాగబాబు.
ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి కలసి పనిచేయాలని తాను భావిస్తున్నట్టు తెలిపారు. దీనిపై త్వరలోనే స్పష్టత వస్తుందన్నారు. పొత్తులు, సీట్లపై తాను స్పందించలేనని, ఆ వ్యవపారాలు తమ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చూసుకుంటారని చెప్పారు.