ఆస్ట్రేలియా పర్యటనను పాకిస్థాన్ ఘోర పరాజయంతో ప్రారంభించింది. మూడు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా 360 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. నాలుగు రోజుల్లోనే ఈ మ్యాచ్ ముగిసింది. రెండో ఇన్నింగ్స్‌ను 5 వికెట్ల నష్టానికి 233 పరుగుల వద్ద డిక్లేర్ చేసిన ఆసీస్.. పాకిస్తాన్ ఎదుట 449 పరుగుల భారీ లక్ష్యాన్ని నిలిపింది. 450 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్ 89 పరుగులకే కుప్పకూలింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఆసీస్ 1-0 ఆధిక్యం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 487 పరుగులకు ఆలౌట్ కాగా.. పాక్ కేవలం 271 పరుగులకే పరిమితమైంది. సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా.. 5 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసి డిక్లేర్ చేసి 450 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్ధి ముందు ఉంచింది. భారీ లక్ష్య ఛేదనకు దిగిన పాక్.. ఆసీస్ బౌలర్లు మూకుమ్మడిగా అటాక్ చేయడంతో 89 పరుగులకే కుప్పకూలి భారీ తేడాతో ఓటమిపాలైంది.
తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ చెలరేగిపోయాడు. పాకిస్థాన్ బౌలర్లను ఊచకోత కోస్తూ తొలి రోజే భారీ సెంచరీ బాదేశాడు. వార్నర్ విధ్వంసంతో తొలి టెస్ట్‌లో తొలిరోజు పాక్‌పై కంగారులు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. పాక్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న వార్నర్... వన్డే తరహా ఆటతీరుతో చెలరేగిపోయాడు. 211 బంతుల్లో 16 ఫోర్లు, నాలుగు సిక్సులతో 164 పరుగులు చేసి తాను ఎంతటి విలువైన ఆటగాడినో క్రికెట్ ప్రపంచానికి మరోసారి చాటిచెప్పాడు. వార్నర్ భారీ శతకంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 487 పరుగులు చేసింది. పాక్ అరంగేట్రం బౌలర్ ఆమిర్ జమాల్ 6 వికెట్లు పడగొట్టాడు. పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 271 పరుగులు చేసింది. ఇమామ్ ఉల్ హాక్ 62 పరుగులతో రాణించాడు. ఆసిస్ బౌలర్లలో నాథన్ లియోన్ 3, స్టార్క్, కమిన్స్ తలో 2 వికెట్లు పడగొట్టారు.
సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా.. 5 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. దీంతో పాకిస్తాన్ ఎదుట 450 పరుగుల భారీ లక్ష్యం నిలిచింది. అనంతరం భారీ ఛేదనలో పాకిస్తాన్ ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. స్టార్క్ వేసిన తొలి ఓవర్‌లోనే వికెట్ కోల్పోయిన పాకిస్తాన్.. తర్వాత కూడా క్రమం తప్పకుండా వికెట్లు నష్టపోయింది. కెప్టెన్ షాన్ మసూద్‌ను హెజిల్‌వుడ్ ఔట్ చేయగా ఇమామ్ ఉల్ హక్ ను స్టార్క్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఆదుకుంటాడనుకున్న బాబర్ ఆజమ్ 14 పరుగులకే వెనుదిరిగాడు. సౌద్ షకీల్ 24 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పాకిస్తాన్ చివరి ఆరుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమవడంతో ఆ జట్టుకు ఘోర పరాభవం తప్పలేదు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్, జోష్ హెజిల్‌వుడ్‌లు తలా మూడు వికెట్లు తీయగా స్పిన్నర్ నాథన్ లియన్ రెండు, కెప్టెన్ పాట్ కమిన్స్ ఒక వికెట్ పడగొట్టారు. ఇరు జట్ల మధ్య డిసెంబర్ 26 నుంచి మెల్‌బోర్న్ వేదికగా బాక్సింగ్ డే టెస్టు జరుగనుంది. రెండు ఇన్నింగ్స్‌ల్లో మెరుపు హాఫ్ సెంచరీలు చేయడంతో పాటు ఓ వికెట్ కూడా పడగొట్టిన మిచెల్ మార్ష్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఆస్ట్రేలియా గడ్డపై టెస్ట్‌ల్లో పాకిస్తాన్‌కు ఇది వరుసగా 15వ ఓటమి కావడం విశేషం.