రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగిస్తూ ముంబై మేనేజ్‌మెంట్ తీసుకున్న నిర్ణయంతో అభిమానులు భగ్గుమంటున్నారు. ఎక్స్, ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ముంబై ఇండియన్స్ ఖాతాను ఆన్‌ఫాలో చేసేస్తున్నారు. గంటల వ్యవధిలోనే ముంబై ఇండియన్స్ భారీగా ఫాలోవర్లను కోల్పోయింది. ఎక్స్‌లో ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షలమంది ముంబైను అన్‌ఫాలో చేస్తున్నారు. ముంబైకి ఐదు ఐపీఎల్ ట్రోఫీలు అందించిన రోహిత్‌ను ఆడుతుండగానే ఎలా కెప్టెన్సీ నుంచి తప్పిస్తారంటూ అభిమానులు సోషల్ మీడియాలో ప్రశ్నలు గుప్పిస్తున్నారు. అయితే భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ 2023కి ముందే రోహిత్ శర్మకు కెప్టెన్సీ మార్పుపై ముంబై ఇండియన్స్ స్పష్టంగా చెప్పిందని కొన్ని వార్తా సంస్థలు తెలిపాయి.
భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఫ్రాంఛైజీ రోహిత్ శర్మకు ఈ విషయాన్ని వివరించినట్లు తెలుస్తోంది. దీంతో హార్దిక్ పాండ్యా సారథ్యంలో ఆడేందుకు రోహిత్ శర్మ అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే హార్దిక్ పాండ్యా కూడా తనకు ముంబయి ఇండియన్స్ జట్టు పగ్గాలు ఇస్తేనే జట్టులోకి వస్తానంటూ చెప్పాడని కూడా వార్తలు వస్తున్నాయి. ఇందుకు ముంబయి ఇండియన్స్ ఫ్రాంఛైజీ అంగీకరించాకే ట్రేడింగ్ ప్రారంభమైంది.
అరంగేట్ర సీజన్‌లోనూ టైటిల్ అందించిన కెప్టెన్‌ను వదులుకునేందుకు ఏ ఫ్రాంఛైజీ కూడా ఇష్టపడదు. గుజరాత్ కూడా అలాగే భావించింది. కానీ హార్దిక్ పాండ్యా వెళ్తానని తెగేసి చెప్పడంతో చేసేదేం లేక ఒప్పుకుంది. ఇందుకోసం అతడిని కొనుగోలు చేసిన అమౌంట్‌తో పాటు భారీ మొత్తం డిమాండ్ చేసిందని సమాచారం. అన్నిటికీ సిద్ధమైన ముంబయి ఆ మొత్తాన్ని గుజరాత్ టైటాన్స్‌కు ఇచ్చేందుకు ఒప్పుకుని డీల్‌ను ఓకే చేసింది. హార్దిక్ పాండ్యాను జట్టులోకి తీసుకుంది.
ఈ క్రమంలో రోహిత్ కెప్టెన్సీపై ముంబయి చేసిన ప్రత్యేక ట్వీట్ వైరల్‌గా మారింది. 2013లో రోహిత్ ముంబయి ఇండియన్స్ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించినప్పుడు తమను ఒక్కటే అడిగాడని...తమ మీద నమ్మకం ఉంచాలని చెప్పాడని ట్వీట్‌లో ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్ గుర్తు చేసుకుంది. గెలుపైనా.. ఓటమైనా నవ్వుతూ ఉండాలని చెప్పావని... పదేళ్ల కెప్టెన్సీ కెరీర్‌లో ఆరు ట్రోఫీలు సాధించావని... దిగ్గజాల నాయకత్వ వారసత్వాన్ని కొనసాగిస్తూ జట్టును ముందుండి నడిపించావని... ముంబై ఇండియన్స్ ఆ ట్వీట్ రోహిత్‌కు ధన్యవాదాలు తెలిపింది. ధన్యవాదాలు.. కెప్టెన్ రోహిత్ శర్మ అంటూ ముంబయి ఇండియన్స్ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. మరోవైపు ముంబయి కెప్టెన్‌గా రోహిత్ శర్మ అందించిన సేవలను కొనియాడుతూ చెన్నై సూపర్ కింగ్స్ కూడా ట్వీట్ చేసింది. 2013 నుంచి 2023.. దశాబ్దకాలంపాటు ఎన్నో సవాళ్లకు స్ఫూర్తిగా రోహిత్ నిలిచాడని కొనియాడింది. రోహిత్.. మీద తమకు చాలా గౌరవం ఉందని పేర్కొంటూ ధోనీ-రోహిత్ ఫొటోను CSK షేర్ చేసింది. భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ హార్ట్ బ్రేక్ ఎమోజీని పోస్టు చేశాడు.
గత రెండేళ్లుగా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా వ్యవహరించి ఈ మధ్యే తిరిగి జట్టులోకి వచ్చిన ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు ముంబై యాజమాన్యం నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. ఈ విషయాన్ని తమ అధికారిక సోషల్‌మీడియా సైట్ల ద్వారా అభిమానులతో ముంబై ఇండియన్స్ పంచుకుంది. వచ్చే ఏడాది ఐపీఎల్ లీగ్‌లో ముంబయి ఇండియన్స్‌ను హార్దిక్ నడిపిస్తాడని ఫ్రాంఛైజీ ప్రకటించింది. రోహిత్ సారథ్యంలో ముంబై 2013, 2015, 2017, 2019, 2020లో టైటిల్ గెలిచింది. 2013లో ఛాంపియన్స్ లీగ్ టీ20లోనూ విజేతగా నిలిచింది. అత్యధిక సార్లు ట్రోఫీ నెగ్గిన జట్టుగా చెన్నైతో కలిసి ముంబై అగ్రస్థానంలో ఉంది. ఇది కేవలం రోహిత్ శర్మ వల్లనే సాధ్యమైంది. 2013 మధ్యలో నుంచి 2023 వరకు అంటే 11 సీజన్ల పాటు ముంబయికి రోహిత్ సారథ్యం వహించాడు. కెప్టెన్‌గా మొత్తం 163 మ్యాచ్‌ల్లో 91 విజయాలు అందుకున్నాడు. 68 మ్యాచ్‌ల్లో ఓటమి ఎదురైంది. నాలుగు టై అయ్యాయి.