Janasena News : జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం, అనుచిత వ్యాఖ్యలు చేసిన సోషల్ మీడియా హ్యాండిల్స్ పై ఆ పార్టీ పోలీసులకు ఫిర్యాదు చేసి చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. అత్యధికంగా వైఎస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీకి చెందిన   నాయకులు, కార్యకర్తలతో పాటుగా, వారి అనుబంధ యూట్యూబ్ ఛానెల్స్, పలు మీడియా సంస్థలు ఉన్నాయి. వీరందరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జనసేన పార్టీ ప్రకటించింది. వైసీపీకి చెందిన పన్నెండు ట్విట్టర్ అకౌంట్ల వివరాలను కూడా జనసేన ప్రకటించింది. 


 





 


జనసేన పార్టీ, జనసేన కార్యకర్తల్లో పవన్ కల్యాణ్ గురించి తప్పుడు ప్రచారం చేయడం ద్వారా గందరగోళం సృష్టించాలని .. ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలన్న కుట్రతోనే ఇలాంటి పోస్టులు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం కోసం సోషల్ మీడియాలో పెట్టారని జనసేన ఆరోపించింది. ఇది ఖచ్చితంగా కొంత మంది వ్యక్తులు కుట్ర పూరితంగా చేసిన పన్నాగమేనని .. శాంతిభద్రతలకు భంగం కలిగించడంతో పాటు రాజకీయ  పరమైన ప్రయోజానాలు పొందడానికి ..ఇలాంటి పనులు చేస్తున్నారని జనసేన స్పష్టం చేసింది. ఇలా తప్పుడు ప్రచారం చేసిన వారంతా.. వెంటనే క్షమాపణ చెప్పాలని జనసేన డిమాండ్ చేసింది. 


క్షమాపణలు చెప్పకపోతే లీగల్ యాక్షన్ తీసుకునేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని..  పరువు నష్టం, క్రిమినల్ కుట్ర వంటి నేరాల కింద కేసులు నమోదు చేస్తామని తెలిపింది. రెండు రోజుల క్రితం పవన్ కల్యాణ్ తన భార్య అన్నా లెజ్నోవాతో విడిపోయారని.. విడాకులు తీసుకున్నారన్న ప్రచారాన్ని కొన్ని మీడియా సంస్థలు ప్రారంభించాయి.  దీంతో పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంపై వైఎస్ఆర్‌సీపీ మద్దతుదారులు తీవ్రంగా విరుచుకుపడ్డారు. చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.అయితే పవన్ కల్యాణ్..  వారాహి యాత్రకు తన సతీమణితో కలిసి పూజలు చేసి ఆ వార్తలన్నీ అబద్దాలని పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు.


కానీ కొంత మంది వైఎస్ఆర్‌సీపీ నేతలు ఈ ఫోటో కూడా కల్పితమేనే.. గ్రాఫిక్స్ అంటూ వీడియోలు రిలీజ్ చేశారు. దాని కింద కూడా వికృతమైన కామెంట్లు పెట్టారు. ఇవన్నీ వైరల్ కావడంతో.. తమ వ్యక్తిగత జీవితాన్ని ఇంకా ఎక్కువ టార్గెట్ చేసుకుంటారన్న ఉద్దేశంతో.. వీటికి చెక్ పెట్టాలని పవన్ కల్యాణ్ డిసైడయ్యారు. జనసేన లీగల్ సెల్ పవన్ అనుమతితో.. ముందుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. స్పందించని వారిపై కేసులు పెట్టనున్నారు. ఏపీలో పోలీసులు కేవలం వైసీపీ నేతలు చేసే ఫిర్యాదులకే స్పందిస్తారన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకే కోర్టులో కూడా కేసు ఫైల్ చేయాలని నిర్ణయించుకున్నారు.