ఆంధ్రప్రదేశ్‌లో జనసేన పార్టీ ప్రజా ఉద్యమాలు నిర్మించాలని నిర్ణయించుకుంది.  ప్రస్తుతం రాష్ట్రంలో ప్రధాన సమస్యగా రోడ్లు ఉన్నాయి.  నిర్వహణ లేక పోవడంతో వేల కిలోమీటర్ల మేర రోడ్లు ధ్వంసం అయ్య్యాయి. వీటిపై పోరాటం చేసి ప్రభుత్వాన్ని మేల్కొల్పాలని జనసేన నిర్ణయించుకుంది.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పాడైపోయిన రహదారుల మరమ్మతులపై రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా ఉద్యమం చేపట్టాలని పవన్ కల్యాణ్ సూచించడంతో ఈ మేరకు పార్టీ నేతలంతా ఆలోచించి... జేఎస్పీ ఫర్ ఏపీ రోడ్స్ అనే కార్యక్రమానికి రూపకల్పన చేశారు. దీని ప్రకార...  ప్రభుత్వం రోడ్లు మరమ్మత్తు చేసే దిశగా ఒత్తిడి తెచ్చేందుకు పలు కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు.  


ముుందుగా గుంతల మయంగా మారిన రోడ్ల వీడియోలు తీసి పెద్దఎత్తున ప్రదర్శన ఏర్పాటు చేయనున్నారు.  ప్రజల కష్టాలను పట్టించుకోకుండా వైసిపి ప్రభుత్వం ఇష్టమొచ్చినట్టుగా వ్యవహరిస్తోందని జనసేన నిర్ణయానికి వచ్చింది.  ఏపీలో 1,26,000 కిలోమీటర్ల మేర రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయని ..  ప్రజలు ఇబ్బందులు పడుతున్నా, నిత్య నరకం చూస్తున్నా ప్రభుత్వ వైఖరిలో చలనం లేదని జనసేన ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తోది.  రూ. 12,450 కోట్ల రూపాయలు రహదారులు బాగుకోసం కేటాయించామని చెబుతున్న ప్రభుత్వం ఇప్పటి వరకు ఎక్కడా రహదారులను బాగు చేశారో చూపించాలని జనసేన నేతలు డిమాండ్ చేస్తున్నారు.  అక్రమాలకు పాల్పడటం కోసమే రహదారుల మరమ్మతులు చేస్తున్నామని చెబుతున్నారని, కానీ రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో ఎక్కడ రహదారుల మరమ్మతులు జరిగినట్లు కనిపించడం లేదని వెల్లడించారు. ఈ మేరకు రూపొందించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో జనసేన పోస్ట్ చేసిది. 



తాము చేసే పోరాటానికి ప్రభుత్వంలో కదలిక రాకపోతే గాంధీగిరీ పద్దతిలో పోరాటాలు చేయాలని జనసేన నిర్ణయించుకుంది.  గాంధీ జయంతి సందర్భంగా శ్రమదానం నిర్వహించాలని నిర్ణయించారు.  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు చోట్ల శ్రమదానంలో పాల్గొంటారని జనసేన పార్టీ ప్రకటించింది. జనసేన పార్టీ చాలా రోజులుగా ప్రత్యక్ష పోరాటాలకు దూరంగా ఉంది. తొలి సారిగా ప్రజల్లోకి రోడ్ల సమస్యపైనే రావాలని నిర్ణయించుకుంది. ఆషామాషీగా కాకుండా సీరియస్‌గా ప్రభుత్వంలో కదలిక వచ్చేలా పోరాటాలకు ప్రణాళిక సిద్దం చేసుకుంది. 


జనసేన అధినేత పవన్ కల్యాణ్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నప్పటికీ పార్టీ కార్యక్రమాల కోసం నిరంతరంగా సమీక్ష చేస్తున్నారు. రోజు వారీ వ్యవహాలను నాదెండ్ల మనోహర్ పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం జేఎస్పీ ఫర్ ఏపీ రోడ్స్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు నాదెండ్ల మనోహరే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి క్యాడర్‌ను చైతన్యవంతం చేస్తున్నారు.