ఏమవుతుందిలే.. ముందైతే కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. తినేసేయాలి. తర్వాత స్నానం చేయోచ్చని అనుకుంటున్నారా? చాలా మంది స్నానం చేశాకే అన్నం తింటారు. మరికొంతమంది తిన్నాక.. స్నానం  చేస్తారు. స్నానం చేశాక భోజనం చేస్తే.. ఏం కాదులే అని అందరూ చెప్తారు. కానీ భోజనం చేశాక స్నానం చేస్తే మంచిదేనా. ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి? 


అమ్మమ్మలు, తాతయ్యలు భోజనం చేసిన తరువాత స్నానం చేయకూడదు అని చెబుతూనే ఉంటారు. ఓ రెండు మూడు తిట్లు కూడా తిట్టి మరీ చెబుతారు. కానీ మనం వినం. మనకు తెలిసిందే రైట్ అనుకుంటాం కదా. అయితే వాళ్లు చెప్పేదాంట్లో మంచి ఉంది. వాళ్లకి వాళ్ల అమ్మమ్మలు, తాతయ్యలు చెప్పి ఉంటారేమో. కానీ దాని వెనక సైన్స్ ఉంది. తిన్న వెంటనే స్నానం చేస్తే.. కడుపులో నొప్పి, జీర్ణ సమస్యలు వస్తాయని వారు చెబుతూ ఉంటారు. 


భోజనం చేశాక వెంటనే వేడి నీళ్లతో స్నానం చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు. వేడినీటితో స్నానం చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత ఉన్న దానికంటే రెండు లేదా మూడు డిగ్రీల ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీని వలన శరీరంలో హైపర్ థెర్మిక్ చర్య ఏర్పడుతుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థను ప్రేరేపిస్తుంది. నాడీ వ్యవస్థకు విశ్రాంతి కలిగిస్తుంది. ఆహారం త్వరగా జీర్ణం కాకుండా చేస్తుంది. దీని ద్వారా ఆహారం జీర్ణం అవ్వడానికి ఇంకా ఎక్కువ సమయం తీసుకుంటుంది.  ఈ లోపు జీర్ణ సమస్యలు, ఛాతీలో మంట, తిమ్మిర్లు, గుండెలో మంట బాధ పెడతాయి.


ఓహో వేడి నీళ్లతో కాకుండా చల్లటి నీళ్లతో చేస్తే.. ఏం కాదన్నమాట అని మీరు అనుకోవచ్చు. దాంట్లో కూడా ఓ పాయింట్ మీరు గమనించాలి. భోజనం చేసిన తర్వాత చల్లటి నీటితో స్నానం చేయడం ఆరోగ్యానికి మంచిదే. ఆహారం త్వరాగా జీర్ణమయ్యేలా చేస్తుంది. ఆహారంలో ఉన్న కొవ్వును కరిగించడానికి దోహదపడుతుంది. భోజనం తర్వాత వెంటనే స్నానం చేయాలి అనుకుంటే.. ముందుగానే స్నానం చేసి ఆహారాన్ని తీసుకోవడం ఉత్తమం. లేదు అంటే భోజనం చేసిన తర్వాత 2 గంటలు కచ్చితంగా వెయిట్ చేయాల్సిందే.


వేడి నీటితో స్నానం చేసినా.. చల్లటి నీటితో స్నానం చేసినా.. రెండు గంటలు వేచి.. స్నానం చేస్తేనే మంచిది. లేదు లేదు.. చేసేస్తా అంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి. స్నానం చేశామంటే.. శరీరంపై పేరుకున్న మురికి మొత్తం వదిలిపోతుంది. శరీరంలోని ప్రతి కణం ఉత్తేజం పొందుతుంది. స్నానం చేశాక ఎనర్జిటిక్‌గా, ఫ్రెష్‌గా ఫీలవుతాం. తద్వారా ఆకలి వేయడం కూడా పెరుగుతుంది. కాబట్టి స్నానం చేశాకే అన్నం తినాలి.


అలా కాదు... నేను స్నానానికి ముందే భోజనం చేస్తా అంటే.. ఇబ్బందులు తప్పవు. తిన్నాక స్నానం చేయడం వల్ల జీర్ణ ప్రక్రియ మందగిస్తుంది. మలబద్ధకాన్ని కొని తెచ్చుకోవడమే అవుతుంది. అంతేకాకుండా ఉదర సంబంధ సమస్యలు కూడా ఎక్కువ అవుతాయి. అదే స్నానం చేశాక భోజం చేస్తే.. ఆకలి పెరిగి.. తిన్నది ఒంటబడుతుంది.


Also Read: Sweets After Meals: భోజనం తర్వాత స్వీట్ ఎందుకు తినాలనిపిస్తుంది..? ఆరోగ్యానికి మంచిదేనా?