Chandrababu Pawan kalyan Meeting For Seats Adjustment: టీడీపీ అధినేత చంద్రబాబుతో (Chandrababu) జనసేనాని పవన్ కల్యాణ్ (PawanKalyan) మరోసారి భేటీ అయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఆదివారం రాత్రి సమావేశం అయ్యారు. తొలుత మధ్యాహ్నం ఇరువురు భేటీ కాగా.. సీట్ల సర్దుబాటుపై దాదాపు 3 గంటల పాటు చర్చించారు. కాగా, రెండో భేటీ దాదాపు గంట పాటు సాగింది. ఇరు పార్టీల పొత్తుల్లో భాగంగా సీట్ల సర్దుబాటుపై విస్తృత స్థాయి చర్చ జరిగినట్లు తెలుస్తోంది.


ప్రధానంగా దానిపైనే


ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేయాలి.?, ఏ సీటులో ఎవరు పోటీ.? ఎవరిని బరిలో దింపాలి.? అనే విషయంలో ప్రధానంగా చర్చ జరిగినట్లు ఇరు పార్టీల వర్గాలు తెలిపాయి. చర్చలు ఇప్పటికే కొలిక్కి వచ్చాయని.. ఈ నెల 8న ఇరువురు నేతలు మరోసారి భేటీ కానున్నట్లు తెలుస్తోంది. అనంతరం సీట్ల సర్దుబాటు, ఉమ్మడి మేనిఫెస్టో, బహిరంగ సభలపై పూర్తి స్పష్టత రానుంది. మధ్యాహ్నం జరిగిన భేటీలో ఇరువురు నేతలు దాదాపు 3 గంటల పాటు చర్చించారు. ఈ క్రమంలో జనసేనకు ఎన్ని సీట్లు కేటాయించాలి.?, ఏయే నియోజకవర్గాలకు సంబంధించి ఎవరికి గెలుపు అవకాశాలు ఉన్నాయన్న సర్వేల ఆధారంగానే తుది కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, రాజోలు, రాజానగరంలో జనసేన పోటీ చేస్తుందని ఇప్పటికే పవన్ కల్యాణ్ ప్రకటించారు. జనసేన అభ్యర్థిగా మచిలీపట్నం నుంచి బాలశౌరి పోటీ చేసే అవకాశం ఉంది. ఇతర అభ్యర్థుల ఎంపికపైనా చర్చలు కొలిక్కి వచ్చినట్లు సమాచారం.


జనసేనకు ఎన్ని సీట్లంటే.?


ఈ సమావేశంలో జనసేనకు 25 నుంచి 30 స్థానాలు కేటాయించాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అయితే, తమవైపు నుంచి ఆశావహులు పెద్ద ఎత్తున ఉన్నారని.. ఇంకొన్ని స్థానాలు కేటాయించాలని పవన్ చంద్రబాబుకు చెప్పినట్లు తెలుస్తోంది. ఉభయ గోదావరి జిల్లాల్లో 50 శాతం షేర్ ఉండాలని జనసేన చెబుతున్నట్లు సమాచారం. అంతేకాకుండా.. విశాఖలోనూ పార్టీ బలంగా ఉందని పవన్ చెప్పినట్లు తెలుస్తోంది. కాగా, గత 4 రోజులుగా హైదరాబాద్ లోనే మకాం వేసిన ఇరువురు నేతలు ఆయా పార్టీల అభ్యర్థుల ఎంపికపై విడివిడిగా కసరత్తు చేశారు. తాజా భేటీలో దీనిపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. జనసేన పోటీ చేసే స్థానాల్లో టీడీపీ ఆశావహులకు నచ్చచెప్పి వారి రాజకీయ భవిష్యత్తుకు ఆ పార్టీ అధిష్టానం హామీ ఇవ్వనుంది. అటు, టీడీపీ పోటీ చేసే స్థానాల్లో జనసేన ఆశావహులకు సద్ది చెప్పి వారి పొలిటికల్ కెరీర్ కు జనసేన అధిష్టానం హమీ ఇవ్వనుంది. సీట్ల అంశంపై ఇరు పార్టీల నేతలకు నచ్చజెప్పాక ఓ మంచి రోజు చూసుకుని స్థానాలను ప్రకటించేందుకు చంద్రబాబు, పవన్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 


Also Read: Pawan Kalyan: 'సీఎం జగన్ అర్జునుడితో పోల్చుకోవడం హాస్యాస్పదం' - టీడీపీ, జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న పవన్ కల్యాణ్