Pawan Kalyan Comments on New Land Right Act: రాష్ట్రంలో సమగ్ర భూరక్ష చట్టం వల్ల న్యాయవాదులకు అనేక ఇబ్బందులు వస్తాయని జనసేనాని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. గుంటూరు, విజయవాడ బార్ అసోసియేషన్ల న్యాయవాదులు శుక్రవారం జనసేన కార్యాలయంలో పవన్, నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) ను కలిశారు. ఈ సమావేశంలో పలువురు సభ్యులు, సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన భూ హక్కుల చట్టం, ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై తమ ఆందోళనకు మద్దతు ఇవ్వాలని పవన్ కు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సమగ్ర భూరక్ష చట్టంలో (New Land Act) లోపాలపై న్యాయవాదులతో చర్చించారు. సర్కార్ తీసుకొచ్చిన కొత్త చట్టంపై ఆందోళన వ్యక్తం చేసిన జనసేనాని.. న్యాయవాదుల పోరాటానికి తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు.


అందుకే తీసుకొచ్చారా.?


న్యాయవాదులతో సమావేశం అనంతరం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. విశాఖలో (Visakha) దోచుకున్న ఆస్తులను చట్టబద్ధం చేసుకునేందుకే ఈ చట్టాన్ని తీసుకొచ్చారా.? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రుషికొండను (Rushikonda) దోచుకుని నచ్చిన వారికి రాసుకోవచ్చని.. సమగ్ర భూరక్ష చట్టం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని మండిపడ్డారు. 'సమగ్ర భూరక్ష చట్టం వల్ల న్యాయవాదులకు అనేక ఇబ్బందులు వస్తాయి. నా భూమిపై నీ హక్కు ఏంటనేది ఇక్కడి సమస్య. ఈ చట్టం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుంది. రెవెన్యూ అధికారుల సాయంతో ఆస్తులు దోచుకోవచ్చు. కోర్టు నుంచి న్యాయ రక్షణ పొందవచ్చు అనే దాన్ని ఇందులో లేకుండా చేశారు. సమగ్ర భూరక్షలో కోర్టుల మధ్యవర్తిత్వాన్ని తీసేశారని, ఇది ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకు దారి తీస్తుంది.' అని పేర్కొన్నారు. 


జగన్ బొమ్మ ఎందుకు.?


వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారసత్వంగా వచ్చే పట్టా పుస్తకాల్లో సీఎం జగన్ (CM Jagan) ఫోటో ఉండడం ఏంటి.? అని పవన్ విస్మయం వ్యక్తం చేశారు. 'భూ హక్కు చట్టాన్ని రాష్ట్రపతి ఆమోదం కోసం పంపారు. ఎవరి ఆస్తులైనా వారి కబంద హస్తాల్లో పెట్టుకునేలా చట్టం చేశారు. చట్టంలోని అంశాలను ముందుగానే అమలు చేసేస్తున్నారు. రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల నుంచి న్యాయవాదుల వరకూ ఉద్యమాలు చేసే పరిస్థితి వచ్చింది. సమగ్ర భూరక్షకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న న్యాయవాదులకు సంపూర్ణ మద్దతు ఇస్తా. ఈ అంశంపై మరింత అధ్యయనం చేస్తాను. సగటు మనిషికి సులువుగా అర్థం అయ్యేలా వివరిస్తాను. ఇందుకు కొంత సమయం పడుతుంది.' అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.


ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై న్యాయవాదులంతా కలిసికట్టుగా ముందుకు రావాల్సిన అవసంర ఉందని జనసేన లీగల్ సెల్ ఛైర్మన్ ప్రతాప్ అన్నారు. ప్రజల ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేసే విధానమని, ఈ చట్టం వల్ల తీవ్రంగా నష్టపోతామని వివరించారు. జనసేన అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చినట్లు చెప్పారు. నిపుణులతో చర్చించకుండానే.. ప్రభుత్వం ఏకపక్షంగా చట్టం చేసిందని మండిపడ్డారు. హైకోర్టులో ఇంకా అమల్లో లేదని చెబుతూనే, క్షేత్రస్థాయిలో మాత్రం అమలు చేస్తున్నానరి ఆరోపించారు. ప్రజలను, కోర్టును ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.


Also Read: Amaravati Case : ఆర్‌ 5 జోన్‌లో ఇళ్లపైనా ఏపీ సర్కార్‌కు నిరాశే - ఏప్రిల్‌కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు !