జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్వీట్ల వార్ కొనసాగుతోంది. రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ ఏపీ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలకు మంత్రులు ఘాటుగా స్పందించారు. దీనిపై పవన్ కూడా రివర్స్ కౌంటర్ ఇచ్చారు. దానికి కౌంటర్‌గా మంత్రి పేర్ని నాని కూడా మరో ట్వీట్ చేశారు. తాజాగా పవన్ మరోసారి వైసీపీ ప్రభుత్వంపై ఘాటు విమర్శ చేశారు. ‘‘వైసీపీ పాలసీ ఉగ్రవాదం. దీంతో అన్ని రంగాలు నాశనమవుతాయి. పాలసీ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాల్సిన సమయం వచ్చింది’’ అని పవన్ ట్వీట్ చేశారు.
"హిందూ దేవాలయాలు, హిందూ దేవతామూర్తుల విగ్రహాలపై ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 140 దాడులు, విధ్వంసాలు. వై.సి.పి. పాలనలో ఆంధ్రప్రదేశ్ లో ఈ రెండున్నర ఏళ్లలో జరిగిన ప్రగతి ఇదే! దాడులకు పాల్పడిన దోషులంతా క్షేమం. ఎక్కడున్నాయి వై.సి.పి. గ్రామ సింహాలు?" అని పవన్ ట్వీట్ చేశారు.
బాధితులను మానవతా దృక్పథంతో ఆదుకోవాలి
గులాబ్ తుపాను బాధితులను మానవతా దృక్పథంతో ఆదుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. తుపాను సృష్టించిన బీభత్సం, భారీ వర్షాల వల్ల ఉత్తరాంధ్ర నుంచి కృష్ణా జిల్లా వరకూ అతలాకుతలమయ్యాయని పవన్ అన్నారు. లోతట్టు ప్రాంతాలు మునిగిపోయి వేలాది ఇళ్లల్లో నీళ్ళు చేరిందని, జనజీవనం అస్తవ్యస్తం కావడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆదుకోవాలని కోరారు. ఉత్తరాంధ్రలో పలు ప్రాంతాల్లో విద్యుత్ సదుపాయం దెబ్బ తినడంతో ప్రజలు అంధకారంలో ఉన్నారన్న పవన్.. వీలైనంత త్వరగా విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థలను పునరుద్ధరించాలని సంబంధిత శాఖలకు విజ్ఞప్తి చేశారు. జనసేన నాయకులు, శ్రేణులు తమ పరిధిలో బాధితులకు సహాయపడాలని పవన్ పిలుపునిచ్చారు.
Also Read: 'జనం ఛీత్కారాలు, ఓటర్ల తిరస్కారాలు'.. అంటూ పవన్ కు మంత్రి పేర్ని నాని కౌంటర్
ఎకరానికి రూ.25 వేల నుంచి రూ.30 వేల పరిహారం ఇవ్వాలి
ప్రకృతి విపత్తులకు అధికంగా రైతాంగం నష్టపోతుందని పవన్ అభిప్రాయపడ్డారు. అప్పులు చేసి, కాయకష్టంతో సాగు చేసే రైతులు తుపాన్లు, భారీ వర్షాల వల్ల తీవ్రంగా దెబ్బతింటున్నారన్నారు. గులాబ్ తుపాను మూలంగా సుమారు 2 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు తెలుస్తోందని తెలిపారు. ఎక్కువ మేర వరి దెబ్బతిందన్న పవన్.. పంట నష్ట పరిహారం లెక్కించడంలో ప్రభుత్వం అనుసరించే విధానాలు మారితేనే రైతులకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. నామ మాత్రపు సాయంతో సరిపెడితే ప్రయోజనం ఉండదని పవన్ స్పష్టంచేశారు. నివర్ తుపాను సమయంలో పంటలు దెబ్బ తిన్న ప్రాంతాల్లో పర్యటించినప్పుడు రైతులు, కౌలు రైతుల ఆవేదన స్వయంగా తెలుసుకున్నానని పవన్ తెలిపారు. ఎకరానికి రూ.25 వేలు నుంచి రూ.30 వేలు వరకూ పరిహారం ఇస్తేనే రైతులు కోలుకుంటాని అభిప్రాయపడ్డారు.
పవన్ ఫైర్ ఉన్న వ్యక్తి...ఇతర సమస్యలపై కూడా మాట్లాడాలి: సీపీఐ రామకృష్ణ
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సినిమా టికెట్ల విషయంపై స్పందించడం మంచిదేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. పవన్ పై ముగ్గురు మంత్రులు విరుచుకుపడ్డారని, ఇరు వర్గాలు తీవ్రవిమర్శలు చేసుకున్నాయన్నారు. ఒక సినిమా టిక్కెట్ల పైనే పవన్ మాట్లాడడం సరికాదని రామకృష్ణ అన్నారు. రాష్ట్ర ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కోంటున్నారని, రైతు సమస్యలపై కూడా పవన్ కల్యాణ్ మాట్లాడితే బాగుంటుందన్నారు. ముఖ్యంగా అమరావతి రైతులు దాదాపు 700 రోజుల నుంచి ధర్నా చేస్తున్నా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని రామకృష్ణ అన్నారు. భారత్ బంద్ లో జనసేన ఎందుకు పాల్గోలేదో చెప్పాలన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం కార్మికులు 285 రోజులుగా పోరాటాలు చేస్తున్నా పవన్ దానిపై ఒక్క మాట కూడా మాట్లాడడంలేదని విమర్శించారు. ఇలాంటి ప్రజా సమస్యలపై స్పందించకుండా సినిమా టికెట్లపై మాట్లాడితే ప్రజలు అపార్థం చేసుకుంటారని రామకృష్ణ అన్నారు. పవన్ కల్యాణ్ అంటే ఫైర్ ఉన్న వ్యక్తి అన్న రామకృష్ణ.. రాష్ట్ర సమస్యలపై కూడా పవన్ పోరాడాలని సూచించారు.