రిపబ్లిక్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా ఏపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పించారు. అయితే దీనికి కౌంటర్ గా మరుసరి రోజు ఏపీ మంత్రులు మాట్లాడారు. మంత్రి పేర్ని నాని పవన్ కల్యాణ్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అప్పుడు మెుదలైన మాటల యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ట్విట్టర్ వేదికగా నడుస్తూనే ఉంది. 'తుమ్మెదల ఝుంకారాలు, నెమళ్ల క్రేంకారాలు, ఏనుగుల ఘీంకారాలు, వైకాపా గ్రామ సింహాల గోంకారాలు సహజమే' అంటూ సోమవారం రాత్రి పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. దీంతో పాటు 'హూ లెట్ ద డాగ్స్ ఔట్' అన్న పాటను ట్వీట్ చేస్తూ.. ఇది తనకు ఇష్టమైన పాటల్లో ఒకటిగా పేర్కొన్నారు.
పవన్ కల్యాణ్ ట్వీట్లకు మంత్రి పేర్ని నాని సైతం అదే స్థాయిలో బదులిచ్చారు. 'జనం ఛీత్కారాలు, ఓటర్ల తిరస్కారాలు, తమరి వైవాహిక సంస్కారాలు, వరాహ సమానులకు న‘మస్కా’రాలు' అని ట్వీట్ చేశారు. అనంతరం పవన్ కల్యాణ్‌పై ఓ ట్రోల్ వీడియోనూ పోస్ట్ చేశారు.
గాంధీగిరి తరహా నిరసన
అయితే ఓ వేపు మాటల యుద్ధం జరుగుతుంటే.. పవన్ మరోవైపు గాంధీ జయంతి అయిన అక్టోబర్ 2వ తేదీ నుంచి ప్రభుత్వంపై గాంధీగిరి తరహా నిరసన చేపట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే రోడ్ల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు అడుగుకో గుంత, గజానికో గొయ్యి అంటూ ప్రత్యేక డిజిటల్ ఉద్యమాన్ని జనసేన నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా దెబ్బతిన్న రహదారుల ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగుతున్నారు.
పలుగు, పార చేతబట్టి శ్రమదానం చేయాలని నిర్ణయించారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున ఉదయం 10 గంటలకు తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం దగ్గర దెబ్బతిన్న రోడ్డుకు మరమ్మతులు చేయనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు అనంతపురం జిల్లా కొత్తచెరువు పంచాయతీ పరిధిలోని పుట్టపర్తి-ధర్మవరం రోడ్డును బాగుచేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన శ్రేణులు ఈ శ్రమదానం కార్యక్రమంలో పాల్గొంటాయి.
Also Read: Pawan Kalyan: వైసీపీ నేతలకు పవన్ రివర్స్ కౌంటర్... ట్విట్టర్ వేదికగా వరుస పంచ్ లు...