Janasena chief Pawan Kalyan in Pithapuram Assembly constituency: పిఠాపురం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నానని ఇటీవల ప్రకటించారు. ఈ ప్రకటన తర్వాత పవన్ కళ్యాణ్ తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో తొలిసారి పర్యటించారు. పిఠాపురం తనకు ప్రత్యేక నియోజకవర్గం అని, ఈ ప్రాంతాన్ని తన స్వస్థలం చేసుకుంటానని పవన్ స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా తనకు పిఠాపురం అంటే తనకు చాలా ఇష్టమన్నారు. పిఠాపురం నుంచి పోటీ చేసేందుకు తనకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు.
పిఠాపురంలో మంగళవారం (మార్చి 19న) నిర్వహించిన ఓ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. 2019లో పిఠాపురం నుంచి పోటీ చేయాలంటే ఆలోచించాను. ఈ చోటును ఓ నియోజకవర్గంగా చూడలేదు. ఉమ్మడి నియోజకవర్గంలో కీలక స్థానం ఇది. ఇక్కడ ఉండే కొన్ని గొడవలు, కులాల విషయాలు అన్ని చూశాను. కులాల ఐక్యత ఉంటూనే కాపు సమాజం పెద్దన్న పాత్ర పోషించాలి. ఈరోజు తన కల సాకారం కానుంది. భీమవరం, గాజువాక, పిఠాపురం నియోజకవర్గాలు నాకు 3 కళ్లు. నా గెలుపు కోసం ఆలోచించకుండా, పార్టీ కోసం ప్రజల కోసం ఆలోచిస్తుంటే.. మిమ్మల్ని అసెంబ్లీకి పంపించే బాధ్యత మేం తీసుకుంటామని పిఠాపురం నేతలు, ప్రజలు చెప్పడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. పిఠాపురం నుంచే ఆంధ్రప్రదేశ్ దశా దిశ మార్చే ప్రయత్నం చేద్దాం. తనకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు’.
పిఠాపురం నుంచి భారీ ఎత్తున జనసేనలో చేరికలు
పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గ పర్యటన సందర్భంగా పెద్ద ఎత్తున స్థానిక నేతలు జనసేన పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిని ప్రత్యేకంగా అభినందించారు. పిఠాపురం ప్రజలు తనను ఆశీర్వదించి విజయం చేకూర్చాలని పవన్ కళ్యాణ్ కోరారు. ఉప్పాడలో ప్రతిసారి రోడ్డు కోతకు గురై మత్స్యకార కుటుంబాలు ఎంత ఇబ్బంది పడుతున్నాయో తెలుసు, దీన్ని ఏపీకి మోడల్ నియోజకవర్గంగా చేద్దామని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే అభివృద్ధి చేస్తే ఎలా ఉంటుందో చూపిద్దామన్నారు. తాను అందర్నీ కలుపుకుని వెళ్లే వ్యక్తినని, ఒక్కసారి తనతో కలిసి వస్తే ఎప్పటికీ పార్టీని వీడరని చెప్పారు.
నోటాకు వేసిన ఓట్లు జనసేనకు..
నోటాకు ఎక్కువ ఓట్లు వేశామనివ గతంలో కొందరు తనకు చెప్పారని, ఈసారి ఆ ఓట్లు జనసేన పార్టీకి వేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు. మధ్య తరగతి మనుషులు ఎక్కువగా ఉన్న ప్రజలు తన నియోజకవర్గంలో ఉన్నట్లు చూశానన్నారు. సహజ వనరుల్ని ఎవరూ దోపిడీ చేయకుండా తన వంతు పోరాటం చేస్తానన్నారు.