Pawan Kalyan Hugs Chandrababu: గత ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్ విపత్కర పరిస్థితులు ఎదుర్కొందని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు.  ఎన్డీయే కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా చంద్రబాబు (Chandrababu) పేరును పవన్ ప్రతిపాదించారు. కష్టాల్లో ఉన్న ఏపీని గాడిన పెట్టేందుకు చంద్రబాబు లాంటి అనుభవజ్ఞుడైన నాయకుడు అవసరం అని చెప్పారు. అనంతరం చంద్రబాబును పవన్ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. విజయవాడ ఏ కన్వెన్షన్ హాలులో మంగళవారం ఎన్డీయే కూటమి ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. చంద్రబాబును ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ తీర్మానాన్ని గవర్నర్‌కు పంపనున్నారు. ఆయన ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం పంపనున్నారు. అనంతరం బుధవారం ఉదయం 11:27 గంటలకు ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేస్తారు.



'దేశం మొత్తానికి స్ఫూర్తి'



ఎన్నికల్లో కూటమి అద్భుత మెజార్టీతో 164 అసెంబ్లీ స్థానాలు, 21 లోక్ సభ స్థానాలను దక్కించుకుందని జనసేనాని పవన్ కల్యాణ్ అన్నారు. ఈ విజయం దేశం మొత్తానికి స్ఫూర్తినిచ్చిందని చెప్పారు. 'ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వం అని ఇప్పటం సభలో చెప్పాం. అదే మాటపై నిలబడి ఎంతమంది ఎన్ని అంటున్నా ఓర్చుకున్నాం. ఒడుదొడుకులు ఎదుర్కొన్నాం. తగ్గాం.. ప్రజల్లో నమ్మకాన్ని పెంచి అద్భుత మెజార్టీతో ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నాం. కూటమి ఎలా ఉండాలో అందరం కలిసికట్టుగా చూపించాం. కక్ష సాధింపులు, వ్యక్తిగత దూషణలకు సమయం కాదు. 5 కోట్ల మంది ప్రజలు మనందరిపై నమ్మకం పెట్టుకున్నారు. అభివృద్ధిని సమష్టిగా ముందుకు తీసుకెళ్లాలి.' అని పవన్ పిలుపునిచ్చారు.


'హామీల అమలు మన బాధ్యత'


రాష్ట్రాన్ని సమష్టిగా అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని పవన్ కల్యాణ్ అన్నారు. సాగు, తాగునీరు, విద్య, వైద్యం, శాంతిభద్రతల విషయంలో బలంగా నిలబడతామని చెప్పామని.. ఆ మాటకు కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. ఉమ్మడి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను బాధ్యతగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు. 'గత ఐదేళ్లలో రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడింది. ఇలాంటి సమయంలో సుదీర్ఘం రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు కావాలి. 4 దశాబ్దాల అనుభవం, అభివృద్ధిపై అపార అవగాహన, పెట్టుబడులను తీసుకొచ్చే సమర్థత, యువతకు ఉపాధి కల్పన, విదేశాల అధ్యక్షులను తెలుగు రాష్ట్రాల వైపు మళ్లించగలిగే శక్తి ఉన్న నేత చంద్రబాబు. ఆయన నాయకత్వం రాష్ట్రానికి చాలా అవసరం.' అని పవన్ కొనియాడారు.


'జైల్లో నలిగిపోయారు'


'వైసీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబును అన్యాయంగా జైల్లో పెట్టారు. జైల్లో ఆయన పడ్డ బాధను చూశాను. నలిగిపోయారు. అప్పుడు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఆవేదనను చూశాను. మంచిరోజులు వస్తాయి. కన్నీళ్లు పెట్టొద్దని చెప్పాను. చెప్పినట్లుగానే మంచి రోజులు వచ్చాయి. చంద్రబాబుకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చెబుతున్నా. అద్భుతమైన పాలనను అందివ్వాలని కోరుకుంటున్నా. ఆయన హయాంలో విద్య, ఉపాధి, వ్యవసాయం, వైద్యం సహా అన్ని రంగాలు అభివృద్ధి సాధిస్తాయి. రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుంది.' అని పవన్ కల్యాణ్ ప్రశంసలు కురిపించారు.


Also Read: NDA LP Leader: ఎన్డీయే కూటమి శాసనసభా పక్ష నేతగా చంద్రబాబు ఏకగ్రీవ ఎన్నిక - సీఎం అభ్యర్థిగా ప్రతిపాదన