Janasena March 14 : జనసేన పార్టీ పదో ఆవిర్భావ సభను మచిలీపట్నంలో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ అధికారికంగా ప్రకటించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే లా, ప్రజల పక్షాన నిలిచేలా జనసేన కార్యక్రమాలు నిర్వహించిందని నాదెండ్ల మనోహర్ గుర్తు చేసుకున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తొమ్మిదేళ్ల క్రితం పార్టీ ని పెట్టారని.. వ్యక్తిగతంగా ఎన్నో అవమానాలు చేసినా ప్రజల కోసం నిలబడ్డారన్నారు. మా జనసేన నాయకులు, వీర మహిళలు అధినేత అండగా నిలిచారు .. ఏ కార్యక్రమానికి పిలుపు ఇచ్చినా స్పందించారని సంతృప్తి వ్యక్తం చేశారు.
వారాహి వాహనంపై ర్యాలీగా వేదిక మీదకు రానున్న పవన్ కల్యాణ్
మార్చి 14 జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని.. రాష్ట్ర భవిష్యత్తు కోసం జనసేన ముందుకు వెళ్లేలా కార్యాచరణ ఉంటుందని ప్రకటించారు. పదో ఆవిర్భావ దినోత్సవ సభను మచిలీపట్నం లో నిర్వహిస్తామన్నారు. తుఫాన్ సమయంలో పవన్ కళ్యాణ్ ఆ ప్రాంతంలో పర్యటించారని.. రైతులను ఆదుకోని జగన్ ప్రభుత్వం అనేక ఇబ్బందులు పెట్టిందన్నారు. ఆనాడు రైతులకు పవన్ అండగా నిలిచారని అందుకే మచిలీపట్నం ప్రజలు ముందుకు వచ్చి సభ పెట్టాలని కోరారని మనోహర్ గుర్తు చేసుకున్నారు. 34ఎకరాల్లో ప్రత్యేకంగా సభ కోసం ఏర్పాట్లు చేస్తున్నామని.. భద్రత పరంగా తగిన విధంగా అన్ని జాగ్రత్త లు తీసుకుంటామని ప్రకటించారు. మహనీయులు గురించి చాటి చెప్పేలా అక్కడ ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని.. మువ్వెన్నెల జెండా రూపకర్త పింగళి వెంకయ్య, ను గుర్తు చేసుకుంటామన్నారు. పార్టీ ఆవిర్భావ వేదికకు పొట్టి శ్రీరాములు వేదికగా నామకరణం చేశామన్నారు. సుభాష్ చంద్రబోస్ ను స్మరించుకుంటామని తెలిపారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని నాదెండ్ల పిలుపు
సాయంత్రం జరిగే సభ కు పవన్ ఐదు గంటలకు వస్తారని.. మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి వారాహి వాహనం లో పవన్ కళ్యాణ్ బయలు దేరతారని మనోహర్ తెలిపారు. వైసిపి ప్రభుత్వాన్ని ఇంటికి పంపే విధంగా జనసేన ప్రణాళిక ఉంటుందని స్పష్టం చేసారు. త్వరలోనే మళ్లీ ఈ సభకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని మనోహర్ తెలిపారు. ప్రజల కోసం, రాష్ట్ర శ్రేయస్సు కోసం పాటుపడుతున్న పవన్ ను ఆదరించాలని కోరారు. వైసిపి విముక్త ప్రభుత్వాన్ని తీసుకు రావాలని.. ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసిపి కి వ్యతిరేకంగా ఓటు వేయాలని పవన్ కళ్యాణ్ తరపున నేను కోరుతున్నానని తెలిపారు. పార్టీ శ్రేణులకు కూడా పవన్ తన మాటగా చెప్పాలన్నారు
పేర్ని నాని నియోజకవర్గంలో సభ పెట్టడంలో రాజకీయ వ్యూహం !
మచిలీపట్నం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న పేర్ని నాని ఉన్నారు. జనసేనానిపై ఆయన ఘాటు విమర్శలు గుప్పిస్తూ ఉంటారు. ఇప్పుడు ఆయన నియోజకవర్గ గడ్డపైనే ఆవిర్భావ సభను ప్లాన్ చేశారు. గత ఏడాది ఆవిర్భావ సభను ఇప్పటంలో నిర్వహించారు. చివరి వరకూ ఆవిర్భావ సభ కోసం ఇబ్బందులు తప్పలేదు. చివరికి రైతులు ముందుకు వచ్చి పొలం ఇవ్వడంతో సభ నిర్వహించారు. అయితే ఈ సారి ముందుగానే మచిలీపట్నంలో స్థలం ఖరారు చేసుకుని అధికారిక ప్రకటన చేసినట్లుగా తెలుస్తోంది.