Jaggampet MLA To TDP :   ఉమ్మడి తూ.గో జిల్లా  జగ్గంపేట నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయనకు టిక్కెట్ ఇచ్చేది లేదని ఇప్పటికే సీఎం జగన్ తేల్చి చెప్పారని ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో మాజీ మంత్రి తోట నరసింహంకు జగ్గంపేట టిక్కెట్ ఖరారు చేశారంటున్నారు.  తోట నరసింహకు.. జ్యోతుల చంటిబాబుకు  రాజకీయంగా  తీవ్ర విబేధాలున్నాయి. దీంతో ఇక వైసీపీలో ఉండటం అనవసరం అనుకుని పార్టీ మారుతున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.                                     


జ్యోతుల చంటిబాబు.. ఇప్పటికే టీడీపీ పెద్దలతో చర్చలు పూర్తి అయినట్టు ప్రచారం సాగుతోంది. జ్యోతుల చంటిబాబు మొదటి నుంచి టీడీపీలోనే ఉన్న నేత.  2009, 2014 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరుపున జగ్గంపేట నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు చంటిబాబు.. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏలేరు ప్రాజెక్ట్ చైర్మన్ గా చంటిబాబును నియమించారు. అయితే ఆయనపై గెలిచిన వైసీపీ నేత జ్యోతుల నెహ్రూ టీడీపీలో చేరడంతో ఆయన స్థానం గల్లంతయింది. దీంతో వైసీపీలో చేరిపోయారు.  2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి జగ్గంపేట స్థానంలో పోటీ చేసిన ఆయన విజయం సాధించారు.                               


వైసీపీలో తనకు ఇక రాజకీయ భవిష్యత్ ఉండదని క్లారిటీ రావడంతో  మళ్లీ తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రెడీ అవుతున్నారు . జ్యోతుల నెహ్రూ, జ్యోతుల చంటిబాబు సమీప బంధువులు.. ఎమ్మెల్యేగా ఉంటే తానుండాలి, లేదంటే తన కుటుంబానికి చెందిన వారు ఉండాలి.. కానీ, బయటి వారికి ఎలా మద్దతిస్తామని అనుచరులతో చంటిబాబు వ్యాఖ్యానించినట్టు ప్రచారం సాగుతోంది. జగ్గంపేట అసెంబ్లీ టికెట్ ఇవ్వలేమని టీడీపీ తేల్చిచెప్పినప్పటికీ.. ప్రత్యామ్నాయంగా వేరే చోట నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని చంటిబాబు కోరుతున్నారట.. ఉన్న అవకాశాలను బట్టి పరిశీలిస్తామని టీడీపీ అధిష్టానం చెప్పినట్టు తెలుస్తోంది.


  జనవరి 5 లేదా 6 తేదీల్లో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు పసుపు పార్టీ కండువా కప్పుకునే అవకాశం ఉందని చెబుతున్నారు ఆయన అనుచరులు. గతంలో పార్టీ మార్పుపై సూచన ప్రాయంగా వ్యాఖ్యలు చేశారు. . ‘పార్టీలు ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి.. మేం ఏమైనా ఈ పార్టీ లో శాశ్వతమా? అంటూ ఆయన హాట్‌ కామెంట్లు చేశారు.. ఏ పార్టీలో ఎవరు శాశ్వతం.. ఇప్పుడున్న వారు రేపు ఇంకో పార్టీలో ఉంటారేమో..? రేపు ఏ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారో..? ఎవరికి తెలుసు..? అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద చర్చగా మారాయి. ఇప్పుడు నిజంగానే ఆయన పార్టీ మారుతున్నారు.