AP Cabinet :  విజయదశమి పండుగ నాటి నుంచి విశాఖ నుంచి పరిపాలన చేసేందుకు సీఎం జగన్ మోహన్ రెడ్డి సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని కేబినెట్ భేటీటో మంత్రులకు వివరించారు. దసరా నుంచి విశాఖ నుంచి పాలనకు అందరూ సిద్ధమవ్వాలన్నారు. విశాఖలో రుషికొండ మీద ఇప్పటికే సీఎం క్యాంప్ ఆఫీస్ ను  నిర్మిస్తున్నారు. అయితే ఇది సీఎం జగన్ కోసం అని ఇప్పటి వరకూ ప్రకటించలేదు. ఆ క్యాంప్ ఆఫీస్ నిర్మాణంపై కోర్టులో కేసులు ఉన్నాయి. అవి టూరిజం భవనాల నిర్మాణమని అధికారులు చెబుతున్నారు. గతంలో కూడా.. సీఎం జగన్ తాను అక్టోబర్ నుంచే విశాఖ నుంచి పరిపాలన చేస్తామని ప్రకటించారు. ఆ మేరుక తాజాగా కేబినెట్ భేటీ అనంతరం మంత్రులకు క్లారిటీ ఇచ్చారు. 


కొన్ని కార్యాలయాలను కూడా తలించాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఇందు కోసం ఓ కమిటీ ఏర్పాటు చేస్తున్నామని ఆ కమిటీ సూచనల మేరకు కార్యాలయాలను తరలిస్తామని మంత్రులకు చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే కార్యాలయాల తరలింపుపై ఇప్పటికే న్యాయస్థానాలు స్టే ఇచ్చాయి. అయితే కార్యాలయాలను కూడా తరలిస్తామని సీఎం జగన్ మంత్రులకు చెప్పడం ఆసక్తికరంగా మారింది. డిసెంబర్ లో అమరావతి కేసుల విచారణ సుప్రీంకోర్టులో జరగాల్సి ఉంది. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని కాకుండా... సీఎం జగన్ క్యాంప్ ఆఫీస్ ను విశాఖలో పెట్టుకునే అవకాశం ఉంది. కానీ ఆఫీసుల్ని మాత్రం విసాఖకు తరలించే అవకాశం లేదని అంచనా వేస్తున్నారు.                                


ఎన్నికలు ఎప్పుడు వచ్చినా  సిద్దంగా ఉండాలని మంత్రులకు సీఎం జగన్ సూచించారు.  జమిలీ ఎన్నికల విషయంలో కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూద్దామని సహచరులకు సూచించారు.  అయితే ఎన్నికలకు సంబధించి ఎప్పుడైనా సిద్ధం గా ఉండాలని సూచించారు. అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు స్కాములపైనే ప్రధానంగా చర్చిద్దామని మంత్రి వర్గ సహచరులకు చెప్పినట్లుగా తెలుస్తోంది. అసెంబ్లీ సమవేశాలను అందరూ సీరియస్ గా తీసుకోవాలని..  ప్రతి ఒక్కరూ హాజరు కావాలని ఆదేశించినట్లుగా తెలుస్తోంది.                                                      


చంద్రబాబు అరెస్ట్ అంశం, రాజకీయ పరిస్థితులపైనా చర్చలు జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే సీఎం జగన్ స్పందన ఏమిటో తెలియలేదు. కానీ అసెంబ్లీలో చంద్రబాబు ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు ప్రమేయం ఉన్న స్కాములపై విస్తృతంగా చర్చిద్దామని మంత్రులకు చెప్పడంతో.. ఇరవై ఒకటో తేదీ నుంచి ప్రారంభమయ్యే సమావేశాల్లో కేసుల అంశమే హాట్ టాపిక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి