Telangana Elections 2023: ఢిల్లీలోని ఏైఐసీసీ కార్యాలయంలో నేడు తెలంగాణ ఎన్నికలపై స్క్రీనింగ్ కమిటీ సమావేశం కాబోతుంది. ఈ కమిటీ సమావేశంలో ఛైర్మన్ మురళీధరన్, సభ్యులు జిగ్నేష్ మేవానీ, సిద్ధిఖి, ఎక్స్ అఫిషియో సభ్యులుగా రాష్ట్ర ఇంచార్జి మాణిక్ రావ్ ఠాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డిలు పాల్గొనబోతున్నారు. అయితే సర్వేల నివేదికలతో ఆభ్యర్థుల వడపోత కార్యక్రమం చేపట్టబోతున్నారు. పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు సహా ఇతర సంస్థలతోనూ సర్వేలు చేయించారు.అయితే ఈ సారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీసీలకు 34 సీట్లను కేటాయించాలని నిర్ణయించినట్టు సమాచారం. ఏకాభిప్రాయం కుదిరితే 25 నుంచి 30 సీట్లలో అభ్యర్థులను ఖరారు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు ఉన్న చోట మరోసారి స్క్రీనింగ్ కమిటీ దృష్టి సారించి నిర్ణయం తీసుకుంటుంది. అయితే ఈ నెలాఖరుకల్లా అభ్యర్థుల ఎంపిక కసరత్తు పూర్తి చేయాలని స్క్రీనింగ్ కమిటీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
ఇటీవలే తుక్కుగూడ సభలో ఆరు హామీలు ప్రకటించిన కాంగ్రెస్
రంగారెడ్డి జిల్లాలోని తుక్కుగూడలో నిర్వహించిన తెలంగాణ విజయభేరి సభలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ప్రకటించింది.
- మహాలక్ష్మి పథకం ద్వారా పేద మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం - రూ.500 లకే గ్యాస్ సిలిండర్, రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
- ఇందిరమ్మ ఇండ్లు పథకం కింద ఇళ్లులేని వారికి ఇంటి స్థలం, నిర్మాణానికి రూ.5 లక్షల సాయం. ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలంచేయూత పథకం ద్వారా నెలకు రూ.4 వేల
- పింఛన్. రాజీవ్ ఆరోగ్య శ్రీ లిమిట్ రూ.10 లక్షల వరకు పెంపు
- గృహజ్యోతి కింద ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
- రైతు భరోసా ద్వారా రైతులు, కౌలు రైతులకు ఏటా రూ.15 వేల పంట పెట్టుబడి సాయం. వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12 వేల సాయం. వరి పంటకు ప్రతి క్వింటాల్ కు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించారు.
- యువ వికాసం కింద విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామని హామీ. ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు చేయనున్నారు