హైదరాబాద్‌లో నేటి నుంచి గణేష్ నిమజ్జనాలు మొదలవుతున్నాయి. 28న మహా నిమజ్జనం జరగనుంది. ఇందుకు ప్రభుత్వం అన్నీ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ట్యాంక్ బండ్‌పైకి చేరాయి భారీ క్రేన్లు.
గణేష్ నవరాత్రుల ఉత్సవాలు మొదలై మూడు రోజులు అవుతోంది. దీంతో... నగరంలో నిమజ్జాల హడావుడి మొదలైంది. ఇళ్లు, అపార్ట్‌మెంట్లు, చిన్న చిన్న గల్లీలో పెట్టిన గణేష్ విగ్రహాలను మూడో రోజు నుంచి నిమజ్జనాలకు తరలిస్తుంటారు. ఇవాళ నవరాత్రుల్లో మూడో రోజు కనుక... చిన్న చిన్న గణేష్ విగ్రహాలన్నీ.. నిమజ్జానికి తరలివస్తాయి. దీంతో అధికారులు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నారు.
జీహెచ్‌ఎంసీ పరిధిలో 74 కొలనులను వినాయక నిమజ్జనాలకు సిద్ధం చేశారు. నగరంలోని 30 సర్కిళ్లలో ప్రస్తుతం ఉన్న 28 బేబీ పాండ్స్‌తో పాటు అదనంగా మరో 46 ప్రాంతాల్లో తాత్కాలిక పోర్టబుల్ వాటర్ ట్యాంక్‌లను కూడా ఏర్పాటు చేశారు.
హైదరాబాద్ గణేష్ ఉత్సవాలంటే.. ఒక పెద్ద పండుగ. చిన్నా పెద్దా అంతా కలిసి.. గణేష్ ఉత్సవాలు జరుపుకుంటారు. నిమజ్జాల సమయంలో అయితే ఆ సందడే వేరు. పిల్లలు, ఆడవాళ్లు కూడా.. వినాయక ఊరేగింపు ముందు స్టెప్పులు వేస్తూ వస్తారు. డబ్బు వాయిద్యాలు. విభిన్న రకాల గణనాధులు. ఆహా ఆ ఉత్సవాన్ని... సంబరాన్ని చూసేందుకు రెండు కళ్లు చాలవు. హైదరబాద్‌లో గణేష్ నిమజ్జన వేడుకలు చూసేందుకు విదేశీయులు కూడా వస్తుంటారు. హైదరాబాద్‌లో ఈ ఏడాది 90వేల వినాయక మండపాలు ఏర్పాటు చేశారన్నట్టు అధికారులు చెప్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి విగ్రహాల సంఖ్య 25 శాతం ఎక్కువగా ఉంది. పుణె, ముంబై నగరాలను మించి హైదరాబాద్‌లో గణేశ్ విగ్రహాలు ఏర్పాటయ్యాయని చెప్తున్నారు అధికారులు. విగ్రహాల సంఖ్యకు తగ్గట్టుగానే నిమజ్జన ఏర్పాట్లు చేశామన్నారు మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ప్రకటించారు. ఎక్కడా పొరపాట్లు జరగకుండా.. భక్తులకు ఇబ్బంది లేకుండా... అన్ని శాఖలు సమన్వయం చేసుకుని పకడ్బంధీగా నిమజ్జన ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పారు.
ఇక, 28వ తేదీన హైదరాబాద్‌లో మహానిమజ్జనం జరగనుంది. దీని కోసం ఇప్పటికే ట్యాంక్ బండ్‌పై ఏర్పట్లు పూర్తయ్యాయి. భారీ క్రేన్లు కూడా ట్యాంక్ బండ్‌పైకి చేరుకున్నాయి. ఏ గణేష్‌ను ఎక్కడ నిమజ్జనం చేయాలో అధికారులు ముందే నిర్ణయించారు. నిమజ్జనానికి సంబంధించిన రూట్ మ్యాప్‌ను కూడా నిర్వాహకులకు ముందుగానే ఇచ్చేశారు. దీని వల్ల.. నిమజ్జనం సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయని భావిస్తున్నారు. పక్కా ఏర్పాట్లతో నిమజ్జనం సజావుగా జరిగేందుకు చర్యలు చేపడుతున్నారు.
ఖైరతాబాద్‌లో ఈసారి రికార్డు స్థాయిలో 63 అడుగుల మహాగణపతిని ప్రతిష్టించారు. శ్రీ దశ మహా విద్యా గణపతిగా భక్తులకు దర్శనమిస్తున్న ఈ భారీ గణమయ్య కూడా ఈనెల 28న గంగమ్మ ఒడికి చేరబోతన్నాడు. ఖైరతారాబాద్ మహాగణపతి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా... ప్రభుత్వమే చర్యలు తీసుకుంటోందని చెప్పారు మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్. నవరాత్రుల నుంచి హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేసే వరకు సకల ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జర్మనీ కంపెనీతో మాట్లాడి ప్రత్యేక క్రేన్‌ను కూడా ఖైరతాబాద్‌కు తీసుకొస్తున్నామని చెప్పారు. ట్రాఫిక్ చిక్కులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. విద్యుత్, ట్రాన్స్‌పోర్టు విషయంలో ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. కావాల్సినన్ని క్రేన్లను ఏర్పాటు చేసి... భారీ బందోబస్తు మధ్య నిమజ్జనాన్ని విజయవంతంగా పూర్తి చేస్తామని చెప్పారు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్.
మరోవేపు.. గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా.. శాంతి భద్రతల విషయంలోనూ అన్ని చర్యలు తీసుకుంటున్నారు. బందోబస్తు కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనకు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. వినాయకుల మండపాల వద్ద భద్రతా ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. 28న జరగనున్న మహానిమజ్జనానికి కూడా గట్టి భద్రతా ఏర్పాట్లు చేస్తోంది పోలీసు శాఖ.