Jagan removed Ambati Rambabu from the post of Sattenapalli in charge: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లో ఇంచార్జుల మార్పును జగన్ వేగంగా చేపడుతున్నారు. తాజాగా పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గానికి గజ్జల సుధీర్ భార్గవరెడ్డి అనే లీడర్ ను ఇంచార్జ్ గా ప్రకటించారు. ఈ నియోజకవర్గానికి ఇప్పటి వరకూ సీనియర్ నేత అంబటి రాంబాబు ఇంచార్జ్ గా ఉన్నారు. గత రెండు ఎన్నికల్లోనూ ఆయన పోటీ చేశారు. ఓ సారి గెలిచారు. మరోసారి ఓడిపోయారు. అయితే ఇప్పుడు ఇంచార్జ్ ను మార్చాలని జగన్ నిర్ణయించారు.
సత్తెనపల్లి ఇంచార్జ్‌గా సుధీర్ భార్గవరెడ్డిని నియమించిన జగన్
అంబటి రాంబాబు స్థానికేతర నేత. ఆయన రేపల్లెకు చెందిన నేత. అక్కడి నుంచి ఓ సారి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత వైఎస్ హయాంలో టిక్కెట్ దక్కలేదు కానీ.. నామినేటెడ్ పోస్టులు దక్కాయి. అయితే జగన్ వైసీపీ ప్రారంభించిన తరవాత ఆయన వెంట నడిచారు. సామాజిక సమీకరణాల్లో భాగంగా సత్తెనపల్లి నియోజకవర్గానికి ఇంచార్జ్ గా నియమించారు. 2014లో సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయారు. 2019లో కోడెలపై భారీ తేడాతో విజయం సాధించారు. తర్వాత కోడెల ఆత్మహత్య చేసుకోవడంతో టీడీపీ తరపున గత ఎన్నికల్లో సీనియర్ నేత కన్నా లక్ష్మినారాయణ పోటీ చేసి గెలిచారు.
అంబటి రాంబాబు ప్రత్యక్ష ఎన్నికల పోటీకి దూరం ?
సామాజిక సమీకరణాలు, అంబటి రాంబాబుపై క్యాడర్ కు ఉన్న వ్యతిరేకత కారణంగా ఆయనను మార్చాలని జగన్ నిర్ణయించుకున్నారు. ఇక్కడి నుంచి ఇంచార్జ్ గా పని చేసేందుకు మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రయత్నించారు. కానీ జగన్ కొత్త నేతకు అవకాశం ఇవ్వాలని అనుకోవడంతో నర్సరావుపేటకు చెందిన గజ్జల సుధీర్ భార్గవరెడ్డికి అవకాశం ఇచ్చారు. ఆయన అర్థికంగా స్థితిమంతుడు కావడంతోపాటు సత్తెనపల్లి నియోజకవర్గంలోని ఓ గ్రామం నుంచి వెళ్లి నర్సరావుపేటలో స్థిరపడ్డారు.దీంతో ఆయన సత్తెనపల్లికి లోకల్ అవుతారని భావించి చాన్స్ ఇచ్చారు.
యువనేతలకు అవకాశాలు ఇవ్వాలనుకుంటున్న జగన్
కేసులు పెడుతున్న టీడీపీకి భయపడకుండా పని చేయాలంటే కొత్త యువనేతలకు చాన్సివ్వాలని జగన్ అనుకుంటున్నారు. అందులో భాగంగానే అంబటి రాంబాబును తప్ిపంచి సుధీర్ రెడ్డికి చాన్సిచ్చారు. అంబటి రాంబాబు ఇక ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకపోవచ్చని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఆయనను గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా నియమించారు. ఏ నియోజకవర్గానికీ ఇంచార్జ్ పదవి ఇవ్వలేదు. ఆయన సోదరుడు మురళీ మాత్రం పొన్నూరు నియోజకవర్గ ఇంచార్జ్ గా ఉన్నారు.
Also Read: క్షమాపణలు చెప్పడానికి నామోషీ ఎందుకు? టీటీడీని ప్రశ్నించిన పవన్ కల్యాణ్