chandrababu CM :  చంద్రబాబు మొదటి సారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి 27 ఏళ్లు అయింది. సెప్టెంబర్ 1, 1995వ తేదీన...  - 27 ఏళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. పధ్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా..  మిగిలిన కాలం అంతా ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు చంద్రబాబు చేసిన సేవలను గుర్తు చేసుకుటూ పెద్ద ఎత్తున ట్వీట్లు చేశారు. చంద్రబాబు కూడా  తన  రాజకీయ జర్నీలో కీలక విషయాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగ పూరితమైన ట్వీట్ చేశారు. 



పాలకులు అంటే ప్రజలకు సేవకులు అన్న ఎన్టీఆర్ నినాదాన్ని అమలులోకి తెచ్చేందుకే ప్రజల వద్దకు పాలనతో ప్రభుత్వ అధికార గణాన్ని ప్రజలకు చేరువ చేయడం జరిగిందని తెలిపారు.  జన్మభూమి వంటి కార్యక్రమాలతో ప్రజలను కూడా పాలనలో భాగస్వాములను చేశామన్నారు. ఒక పనిని సాధించాలంటే ఒక విజన్ తో కూడిన స్పష్టమైన ప్రణాళిక అవసరం. అలాగే ఒక రాష్ట్రానికి కూడా దీర్ఘకాల ప్రణాళిక ఉండాలి. అదే నేను రూపొందించిన 'విజన్-2020' అనే విజన్ డాక్యుమెంట్. అప్పట్లో ఎగతాళి చేసినవారే, ఆ తర్వాత ఆ విజన్ డాక్యుమెంట్ ఫలితాలను ప్రత్యక్షంగా చూస్తున్నారని సంతృప్తి వ్యక్తం చేశారు. 


మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలను ఆంధ్రప్రదేశ్ కు తీసుకువచ్చి, ప్రపంచ ఐటీ రంగం దృష్టి రాష్ట్రంపై పడేలా చేయడంతో లక్షలాది ఐటీ ఉద్యోగాలు వచ్చాయి. ఐటీ ఉద్యోగాలకు నిపుణులను సిద్ధం చేసేందుకు పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ కాలేజీలను అందుబాటులోకి తెచ్చామన్నారు.  ఆరోజు పడిన కష్టానికి ఫలితంగా ఈరోజు ఒక రైతు బిడ్డ నుంచి ఒక కార్మికుని కొడుకు వరకు దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ... కుటుంబాలకు అండగా నిలుస్తున్నారని సంతృప్తి వ్యక్తం చేశారు.  అమెరికాలో ఎక్కువ ఆదాయం పొందుతోన్న భారతీయుల్లో 30 శాతం మంది తెలుగువారే అన్నమాట విన్నప్పుడు... నాకెంతో తృప్తిగా అనిపిస్తుంది. ఆనాడు ఒక పదేళ్ల పాటు దేశంలో ఎవరి నోట విన్నా ఆంధ్రప్రదేశ్ మాటే వినిపించేదన్నారు. 


అబ్దుల్ కలాం వంటి వారిని రాష్ట్రపతిగా ఎంపిక చేసుకోవడంలో నా పాత్ర ఉండటం మధుర జ్ఞాపకమన్నారు. రంగరాజన్ వంటి వారిని గవర్నర్ గా ఏపీకి తెచ్చుకున్నాం. తెలుగుదేశం నేతల్లో బాలయోగి గారిని దేశానికి తొలి దళిత స్పీకర్ గా, ఎర్రం నాయుడు గారిని కేంద్రమంత్రిగా చేసుకుని తెలుగుదేశం ఆత్మగా ఉండే సామాజిక న్యాయాన్ని మరింత విస్తృత పరచగలిగామని సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత 2014 లోనూ ఏపీకి ముఖ్యమంత్రిగా ప్రజలు బాధ్యత ఇస్తే...లోటు బడ్జెట్ రాష్ట్రంలో రెండంకెల వృద్ధి రేటు సాధించి చూపించాము. అమరావతిని ప్రపంచ స్థాయి రాజధాని నగరంగా నిర్మించే కృషి చేశామన్నారు.