Adnan Sami Vs YSRCP : బాలీవుడ్ స్టార్ సింగర్ అద్నాన్ సమీ ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి .. ఆర్ఆర్ఎర్ సినిమాలోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చినందుకు అభినందిస్తూ ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌లో తెలుగు ఫ్లాగ్ అనే మాట వాడారు. సీఎం జగన్ ట్వీట్‌లో తెలుగు ఫ్లాగ్ అనే మాటకు అర్థం .. ప్రత్యేక జెండా అనో.. ప్రత్యేకమైన రాష్ట్రం అనో కాదు. సీఎం జగన్ ఒక తెలుగు రాష్ట్రానికి సీఎం. ఆర్ఆర్ఆర్ కూడా ఓ తెలుగు సినిమా.ఇదే ఉద్దేశంతో ట్వీట్ చేశారు. కానీ బాలీవుడ్ సింగర్ అద్నాన్ సమీ మాత్రం ... సీఎం జగన్ అభినందనల్లో సేపరేటిజం చూశారు. విమర్శిస్తూ ట్వీట్ చేశారు.
అద్నాన్ సమీ సీఎం జగన్ ట్వీట్‌పై చేసిన కామెంట్ పై సోషల్ మీడియాలో భిన్న స్పందనలు వచ్చాయి. అయితే ఎక్కువ మంది అద్నాన్ సమీ అభిప్రాయం తప్పు అనే వ్యక్తం చేశారు. భారత దేశం భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశమని గుర్తు చేశారు.
అద్నాన్ సమీ కామెంట్‌పై తెలుగు రాష్ట్రాల్లోని వైఎస్ఆర్‌సీపీ అభిమానులు ఆయనకు గట్టి కౌంటర్ ఇచ్చారు. మంత్రి విడదల రజనీతో పాటు సలహాదారు రాజీవ్ కృష్ణ కూడా స్పందించారు. వీరికి అద్నాన్ సమీ కౌంటర్ ఇచ్చారు.
ఈ అంశంపై సోషల్ మీడియాలో ఇంకా వాదోవవాదాలు జరుగుతున్నాయి. దానికి సమీ కౌంటర్ ఇస్తున్నారు.
చాలా మంది అద్నాన్ సమీ జాతీయతపైనా ప్రశ్నిస్తున్నారు. నిజానికి అద్నాన్ సమీ పాకిస్థాన్ జాతీయుడు. అక్కడి పౌరసత్వం వదులుకుని ఇండియాలో స్థిరపడ్డారు. భారత ప్రభుత్వం పౌరసత్వం కూడా ఇచ్చింది. స్వతహాగా భాతీయుడి కాని అద్నాన్ సమీ.. తన దేశభక్తిని ప్రదర్శించుకోవడం కోసమే ఇలా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిని టార్గెట్ చేసుకున్నారని కొంత మంది విమర్శలు గుప్పిస్తున్నారు.
నిజానికి అద్నాన్ సమీ వివాదాస్పద వ్యక్తి కాదు. మామూలుగా అయితే స్పందించే వారు కాదు. కానీ ఆర్ఆర్అర్ సినిమా పాటకు.. సంగీతానికి సంబంధించినది కాబట్టి.. ఆ సంగీతానికి ప్రాంతీయత ఆపాదించారనే ఆయన స్పందించి ఉంటారని బాలీవుడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గతంలోనూ ఆయన సంగీతానికి ప్రాంతాలుండవని.. వాదించిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయో అంచనా వేయకపోవడతో ఆయన స్పందన మరింత వైరల్ గా మారింది. ఈ వివాదంలో తనపై వచ్చే విమర్శలకు సమీ ఎప్పటికప్పుడు కౌంటర్ ఇస్తూండటంతో అది కొనసాగుతోంది.