ఖమ్మం రాజకీయాల్లో మరో కీలక పరిణామం. మంత్రి హరీష్‌రావు, మాజీ మంత్రి తుమ్మల ఇంటికి వెళ్లి భోజనం చేయటం జిల్లా రాజకీయాల్లో పెద్ద చర్చకు దారి తీసింది. ఇన్నాళ్లు పార్టీలో ఆయనకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదంటూ జరుగుతున్న ప్రచారానికి మంత్రి హరీష్ పుల్‌స్టాప్ పెట్టారు.
ఈ నెల 18న ఖమ్మంలో బీఆర్‌ఎస్ భారీ బహిరంగ సభను ప్లాన్ చేసింది. దీని కోసం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది. జాతీయస్థాయి నేతలను కూడా సభకు రప్పిస్తోంది. దీని ఏర్పాట్లు పరిశీలనలో భాగంగా ఖమ్మం వెళ్లిన మంత్రి హరీష్‌రావు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలవడం సంచలనంగా మారింది.
ఇప్పటికే బీఆర్‌ఎస్‌కు చెందిన సీనియర్ నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రావు బీజేపీలో చేరనున్నారు. మరి కొంతమంది సీనియర్లు కూడా పార్టీ వీడతారంటూ టాక్ నడుస్తోంది. ఈ పుకార్లు వస్తున్న వేళ మంత్రి వెళ్లి మాజీ మంత్రిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. గండుగులపల్లిలోని మాజీ మంత్రి తుమ్మల ఇంటికి వెళ్లిన హరీష్ ఆయనతో కలిసి భోజనం చేశారు. ఈ పర్యటనలో మంత్రి అజయ్, ఎంపీలు నామ నాగేశ్వరరావు, రవిచంద్ర ఉన్నారు. వీళ్లంతా భోజనం చేస్తూ చాలా రాజకీయ అంశాలు చర్చించుకున్నట్టు సమాచారం. తర్వాత తుమ్మల, హరీష్ ఏకంతంగా సమావేశమైనట్టు సమాచారం అందుతోంది. 18న జరిగే బహిరంగ సభకు రావాలని తుమ్మలను మంత్రి హరీష్‌రావు ఆహ్వానించినట్టు తుమ్మల నాగేశ్వరరావు సన్నిహితులు చెబుతున్నారు.
తుమ్మల నాగేశ్వరరావు చాలా కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీలో ఉన్నానని చెబుతున్నప్పటికీ ఎక్కడ కూడా ఆయన సరైన ప్రాధాన్యత లేదన్నది తుమ్మల అనుచరులు చేస్తున్న కామెంట్స్. రెండు రోజు క్రితం సీఎం కేసీఆర్‌తో జరిగిన ఖమ్మం జిల్లా నేతలతో సమావేశంలో కూడా తుమ్మల కనిపించలేదు. ఇంతలో పొంగులేటి శ్రీనివాస్‌రావు పార్టీ మారుతున్నట్టు లీక్‌లు ఇచ్చారు. ఆత్మీయ సమ్మేళనాల పేరుతో అనుచరులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ మార్పుపై అభిప్రాయ సేకరణ చేపడుతున్నారు. ఈ నెల 18న అంటే బీఆర్‌ఎస్ సభ పెట్టిన రోజునే పొంగులేటి అమిత్‌షా, మోదీతో సమావేశమవుతారని టాక్ నడుస్తోంది.
పొంగులేటితో ఎవరు వెళ్తారనే చర్చ జిల్లా రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. దీంతో బీఆర్‌ఎస్ అగ్రనాయకత్వం అలర్ట్ అయింది. ఇప్పటికే సీఎం కేసీఆర్ జిల్లా నేతలతో ఒకసారి సమావేశమయ్యారు. బీఆర్‌ఎస్ సభ విజయవంతం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలు చర్చించారు. అదే టైంలో పార్టీ నుంచి సీనియర్లు వెళ్లిపోకుండా తీసుకోవాల్సిన చర్యలపై కూడా మాట్లాడినట్టు తెలుస్తోంది.
సీఎం ఆదేశాల మేరకు మంత్రి హరీష్‌రావును తుమ్మల ఇంటికి వెళ్లినట్టు సమాచారం. ఆయన స్పెషల్‌గా సభకు ఆహ్వానించడమే కాకుండా.. సీఎం పాల్గొనే కార్యక్రమాలకు కూడా హాజరుకావాల్సిందిగా రిక్వస్ట్ చేశారని టాక్ నడుస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వారం వ్యవధిలోనే సీఎం కేసీఆర్ రెండుసార్లు పర్యటించనున్నారు. ఈ పర్యటనల విజయవంతం చేయాలని తుమ్మలను కోరినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రానున్న రోజుల్లో పార్టీలో ప్రాధాన్యత పెరుగుతుందని భరోసా ఇచ్చినట్టు సమాచారం.