IPS officer Kanti Rana has filed anticipatory bail petition : ముంబై సినీ నటి జెత్వానీని వేధించిన కేసులో పోలీసులు తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని .. తనకు ముందస్తు  బెయిల్ ఇవ్వాలని ఐపీఎస్ అధికారి కాంతి రాణా టాటా ఏపీ హైకోర్టులో పిటిషన్  దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను సోమవారం విచారణకు రానుంది. ఇప్పటికే ముంబై నటిపై తప్పుడు కేసులు పెట్టి వేధించారని డీజీపీ నివేదిక ఇవ్వడంతో కాంతి రాణా టాటాతో పాటు మరో ముగ్గురిని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కానీ ఇప్పటి వరకూ ఆ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారుల పేర్లను చేర్చలేదు. అంటే అధికారికంగా కాంతి రాణా టాటాపై కేసు నమోదు కాలేదు. అయినా ఆయన అరెస్టు చేస్తారంటూ ముందస్తు  బెయిల్ కోసం.. హైకోర్టులో పిటిషన్ వేశారు.     


ముంబై నటి జెత్వానీ ముగ్గురు ఐపీఎస్ అధికారులతో  పాటు కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి మీద ఫిర్యాదు చేశారు. అసలు ఆమెను అరెస్టు చేయడానికి ఫిర్యాదు చేసింది కుక్కల విద్యాసాగర్‌నే. తప్పుడు ఫిర్యాదు చేశారని.. ముంబైలో అమెను అరెస్టు చేయడానికి కూడా కుక్కల విద్యాసాగర్ సహకరించారని తేలడంతో పోలీసులు కుక్కల విద్యాసాగర్ పై కేసు పెట్టారు. అయితే కేసు నమోదైనప్పటి నుండి ఆయన పరారీలో ఉన్నారు. డెహ్రాడూన్ లో ఉన్నట్లుగా గుర్తించిన పోలీసులు వెళ్లి అరెస్టు చేశారు. అక్కడ్నుంచి ఏపీకి తీసుకు వస్తున్నట్లుగా తెలుస్తోంది.   


హీరోయిన్ జెత్వానీ కేసులో కీలక పరిణామం - డెహ్రాడూన్‌లో కుక్కల విద్యాసాగర్ అరెస్ట్


ఈ క్రమంలో కాంతి రాణా టాటా అరెస్టు భయంతో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేశారు  నటి జెత్వానీని ముంబైకి వెళ్లి అరెస్టు చేయాలని ఆదేశాలు జారీ చేసింది అప్పట్లో విజయవాడ పోలీస్ కమిషనర్ గా ఉన్న కాంతిరాణా టాటా.. ఈ మొత్తం వ్యవహారంలో కీలక పాత్ర పోషించారని..తప్పుడు సాక్ష్యాలు పుట్టించారని జెత్వానీ కూడా ఫిర్యాదు చేశారు. జెత్వానీని ఇతర రాష్ట్రాల నుంచి అరెస్టు చేసి తీసుకు వచ్చిన విషయాన్ని అప్పట్లో ప్రకటించలేదు. ప్రభుత్వం మారిన తర్వాత పోలీసులు తనపై ... తన కుటుంబంపై వేధింపులకు పాల్పడ్డారని ఆమె మీడియాకు చెబితేనే తెలిసింది. 


సహంజాగనే  పోలీసులు ఏదైనా కేసులో  సినీ తారలను అరెస్టు చేస్తే ఖచ్చితంగా మీడియాకు చెబుతారు. కానీ కుటుంబం మొత్తాన్ని అరెస్టు చేసి తీసుకు వచ్చినా..నలభై రెండు రోజుల జైల్లో ఉంచినా.. అసలు కేసు విషయం బయటకు తెలియకుండా జాగ్రత్తపడ్డారు. ఇప్పుడు ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో అప్పటి ఇంటలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయలు, అప్పట్లో విజయవాడ డీసీపీగా ఉన్న విశాల్ గున్నీలను సస్పెండ్ చేశారు. ఇప్పుడు విద్యాసాగర్ ను అరెస్టు చేసినందున ఆయనను విచారించి కీలక విషయాలను బయటకు లాగి కేసులు పెట్టే అవకాశం ఉందన్న అంచనాతోనే కాంతి  రాణా టాటా ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారని తెలుస్తోంది.