Investopia in Vijayawada: ఇన్వెస్టోపియా గ్లోబల్-ఏపీ సదస్సు 2025 జులై 23న విజయవాడలోని నోవోటెల్ హోటల్‌లో జరిగింది. ఈ ఈవెంట్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌఖ్ అల్ మర్రీతో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, వ్యాపార నాయకులు పాల్గొన్నారు. దావోస్‌లో చంద్రబాబు నాయుడుతో 5 నిమిషాల సమావేశం తర్వాత ఆయన విజన్‌కు ఆకర్షితులై, 6 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైనట్లు యూఏఈ ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌఖ్ అల్ మర్రీ ప్రకటించారు. ఈ సదస్సు యూఏఈ-భారత ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడానికి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులను ఆకర్షించడానికి ఒక వేదికగా భావిస్తున్నారు.
దుబాయ్ ఆర్థిక వ్యవస్థలా ఏపీ ఎదిగేలా ప్రణాళికలు
ఇన్వెస్ట్ ఇండియా , కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (CII) సంయుక్తంగా నిర్వహించిన ఈ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీలో ఉన్న పెట్టుబడుల అవకాశాలను వివరించారు. ఆంధ్రప్రదేశ్ ను భారతదేశంలో అగ్రగామి సాంకేతిక కేంద్రంగా మార్చాలనే తమ లక్ష్యాన్ని వెల్లడించారు. డ్రోన్స్, ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్ వంటి ఉభయతారక రంగాల్లో మంచి అవకాశాలు ఉన్నాయని వివరించారు.
దుబాయ్‌ను ఎడారి నుంచి స్వర్గంగా మార్చిన దేశంగా చంద్రబాబు ప్రశంసించారు. దుబాయ్ అభివృద్ధిని చూస్తే తనకు అసూయ కలుగుతుందని, ఆంధ్రప్రదేశ్‌ను కూడా అలాంటి ఆర్థిక కేంద్రంగా మార్చాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపారు రాష్ట్రంలో 974 కి.మీ. తీరప్రాంతం, బలమైన డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి ఉన్నాయని, వ్యవసాయం, హార్టికల్చర్, ఆక్వాకల్చర్, కమర్షియల్ క్రాప్స్‌లో రాష్ట్రం ముందంజలో ఉందన్న్ారు. 2030 నాటికి భారతదేశం 500 గిగావాట్ల రెన్యూవబుల్ ఎనర్జీ లక్ష్యంలో ఆంధ్రప్రదేశ్ 160 గిగావాట్లు సహకరిస్తుందని, అమరావతిలో గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ, భారతదేశంలో మొట్టమొదటి క్వాంటమ్ వ్యాలీని అభివృద్ధి చేస్తున్న అంశాలను వివరించారు.
ఏఐతో భవిష్యత్ లో మరింత ప్రగతి
క్వాంటమ్ టెక్నాలజీ , ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అమరావతి భవిష్యత్తును రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. AI వల్ల ఉద్యోగాలు కోల్పోతామనే భయం అవసరం లేదని, ప్రభుత్వ సేవలను మెరుగుపరచడానికి AIని వినియోగిస్తామని తెలిపారు. "మన మిత్ర" ప్లాట్‌ఫారమ్ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలను అందిస్తున్నామని, క్వాంటమ్ అమరావతికి గేమ్ ఛేంజర్‌గా ఉంటుందన్నారు.
ఈ సదస్సు ఆంధ్రప్రదేశ్‌లోని పెట్టుబడి అవకాశాలను చూపించడం, డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రెన్యూవబుల్ ఎనర్జీ, సెమీకండక్టర్, ఐటీ, హార్టికల్చర్ వంటి రంగాలలో సహకారాన్ని పెంచడం లక్ష్యంగా ఏర్పాటు చేసారు.