Anantapurm News :  అనంతపురం జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. బొమ్మనహాల్ మండలం.. దర్గాహోన్నూరు దగ్గర ట్రాక్టర్‌పై కరెంట్ తీగలు తెగి పడటంతో ఆరుగురు అక్కడిక్కడే చనిపోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా వ్యవసాయ కూలీలు. సమీపంలో మొక్కజొన్న పంట కోతకు వెళ్తూండగా ఈ ఘటన జరిగింది.  బాధితులందరూ.. దర్గాహోన్నూరు గ్రామానికి చెందిన వారు. కరెంట్ తీగలు ఎలా తెగిపడ్డాయన్నదానిపై అధికారులు విచారణ జరుపుతున్నారు. గాయపడ్డ వారిని సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇలాంటి ప్రమాదాలు జరగడం ఇదే మొదటి సారి కాదు.  గత జూన్‌లోనూ ఇలానే ఓ ఆటోపై కరెంట్ తీగలు తెగి పడటంతో ఐదుగురు సజీవదహనం అయ్యారు. వారు కూడా వ్యవసాయ కూలీలే. 


జూన్‌లో ఇదే తరహా ప్రమాదంలో ఐదుగురు కూలీలు మృతి 


జూన్‌లో  సత్యసాయి జిల్లా  తాడిమర్రి మండలం గుడ్డంపల్లి గ్రామానికి చెందిన కూలీలు.. చిల్లకొండయ్యపల్లి గ్రామ సమీపంలో కూలి పనులకు ఆటోలో వెళ్తున్న సమయంలో  హై టెన్షన్ విద్యుత్   తీగలు ఒక్కసారిగా తెగి ఆటో మీద తెగిపడ్డాయి.  ఆటో మొత్తం దగ్ధమైపోతోంది..  ఐదు నిండు ప్రాణాలు నిలువునా మంటల్లో కాలి బూడిదయ్యాయి . ప్రమాద సమయంలో మొత్తం డ్రైవర్‌ తో కలిపి 13 మంది కూలీలు ప్రయాణిస్తున్నారు. వీరిలో డ్రైవర్‌ పోతులయ్య, మరో ఏడుగురు కూలీలు మాత్రమే గాయాలతో బయటపడ్డారు. ఆ దుర్ఘటనలో మరణించిన వారంతా మహిళలే. మృతులను గుడ్డంపల్లి, పెద్దకోట్ల గ్రామస్తులు .


ఉడత కరెంట్ వైర్లను కొరికేసిందని తేల్చిన నిపుణులు - ఉడుతకు పోస్ట్ మార్టం


జూన్‌లో జరిగిన ప్రమాదానికి ఉడుత కారణం అని నిపుణులు గుర్తించారు. ప్రమాదానికి ఓ ఉడత కారణమని అధికారులు చెప్పారు. కాగా.. ప్రమాదం జరిగిన సమయంలో విద్యుత్ తీగలకు తగిలి ఉడత అక్కడికక్కడే మృతి చెందింది. ఆ కళేబరాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు దానిని తాడిమర్రి పశువైద్యశాలలో పోస్టుమార్టం నిర్వహించారు. రెంటు స్తంభంపై ఉడత ఎక్కినప్పుడు షార్ట్‌సర్క్యూట్‌ అయి మధ్యలో తీగ తెగి అదే సమయంలో అటుగా వస్తున్న ఆటోపై పడిందని ఎస్పీడీసీఎల్‌ అధికారులు చెప్పారు. వైద్యులు కూడా అదే చెప్పారు. అయితే  విద్యుత్ స్తంభాలపై పక్షులు, ఉడత, తొండలాంటి ప్రాణులు ఎక్కటం సాధారణమేనని, ఉడతలాంటివి తీగలపైకి ఎక్కినప్పుడు షార్ట్‌సర్క్యూట్‌ అయితే సంబంధిత సబ్‌స్టేషన్‌లో ట్రిప్‌ అయి సరఫరా నిలిచిపోతుంది కానీ విద్యుత్ తీగలు తెగవని కొంత మంది చెబుతున్నారు. 


నాసికరం తీగల వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయా ?


విద్యుత్ సరఫరాకు  నాణ్యతలేని వైర్లు వాడుతున్నారన్న ఆరోపణలు చాలా కాలంగాఉన్నాయి.  హైటెన్షన్ తీగలకు బదులుగా లోటెన్షన్స్ తీగలు వేయడం, ఇన్సులేటర్లు, కండక్టర్లు వంటి వాటి ప్రమాణాలను తగిన రీతిలో పరీక్షించడం లేదని అందుకే ప్రమాదాలు జరుగుతున్నాయని చెబుతున్నారు.  ప్రైవేటు కాంట్రాక్టర్లు  ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని అధికారులతో కుమ్మక్కయి.. ఇలాంటి నాసిరకం వైర్లను సరఫరా చేయడం వల్ల... ప్రమాదాలు జరుగుతున్నాయంటున్నారు. 


ప్రస్తుతం అనంతపురం బొమ్మనహాల్ మండలం.. దర్గాహోన్నూరు దగ్గర ప్రమాదానికి కారణం ఉడుతనా.. నాసి రకం వైర్లా.. లేక మరో కారణమా  అన్నది అధికారులు తేల్చాల్సి ఉంది.