Rains Alert To AP And Telangana: తూర్పు మధ్య బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉత్తర అండమాన్ మీదుగా ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లోపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనించి, ఈ నెల 22వ తేదీ ఉదయం నాటికి వాయుగుండంగా, ఈ నెల 23 నాటికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం ఉందని పేర్కొంది. అనంతరం, ఇది వాయువ్య దిశగా పయనించి ఈ నెల 24 ఉదయం నాటికి ఒడిశా - పశ్చిమబెంగాల్ తీరాలకు ఆనుకుని వాయువ్య బంగాళాఖాతానికి చేరుకునే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
దీంతో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 24 నాటికి మరో వాయుగుండం ఏర్పడనుంది. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అధికారులు వెల్లడించారు. ఈ నెల 24, 25 తేదీల్లో ఉత్తరాంధ్రలో విస్తృతంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు. ఈ నెల 23, 24 తేదీల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈదురుగాలులు వీస్తాయని చెప్పారు. సముద్రం అలజడిగా ఉంటుందని.. ఈ నెల 24 వరకూ మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తిరిగి రావాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. విశాఖ జిల్లా కలెక్టరేట్, తహసీల్దార్ కార్యాలయంలో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు.
ఈ జిల్లాల్లో వర్షాలు
ఆవర్తనం ప్రభావంతో సోమవారం అల్లూరి సీతారామరాజు, పల్నాడు, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అటు, శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
తెలంగాణలోని ఈ జిల్లాల్లో
అటు, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడకక్కడ తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే 4 రోజులు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. సోమవారం.. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, మహబూబాబాద్, హన్మకొండ, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు పడే ఛాన్స్ ఉందని వివరించింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అలాగే, ఈ నెల 25వ తేదీ వరకూ పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
Also Read: Free Gas Cylinder: దీపావళి నుంచి మరో కొత్త పథకం అమలు - ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్