Free Gas Scheme In AP: రాష్ట్ర ప్రజలకు ఏపీ ప్రభుత్వం (AP Government) గుడ్ న్యూస్ చెప్పింది. ఈ దీపావళి పండుగకు మరో కొత్త పథకం అమలుకు శ్రీకారం చుట్టబోతోంది. ఈ నెల 31న పండుగ సందర్భంగా మహాశక్తి పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పింది. ఇందులో భాగంగా ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లను అందించనుంది. ఈ మేరకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) ఆదివారం కీలక ప్రకటన చేశారు. సూపర్ సిక్స్ హామీల అమల్లో భాగంగా దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల (Free Gas Cylinder) పథకాన్ని ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం సంగంజాగర్లమూడిలో నిర్వహించిన పల్లెపండుగ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారని అన్నారు.
రాష్ట్రంలో 1.40 కోట్ల రేషన్ కార్డుదారులు ఉన్నారని.. ప్రతీ కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. 'తదుపరి మంత్రివర్గ భేటీలో ఈ పథకానికి అనుమతి తీసుకుంటాం. ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి ఏడాదికి రూ.3,640 కోట్లకు పైగా ఖర్చవుతుందని అంచనా. దీపావళి సందర్భంగా ప్రతి ఇంట్లో పండుగ వెలుగులు తీసుకొస్తాం. కూటమి ప్రభుత్వంలో మంచి జరుగుతుందని మహిళలు పెద్దఎత్తున ఆశీర్వదించారు. వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నాం.' అని పేర్కొన్నారు.
అధికారుల కసరత్తు
కాగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు పథకాల అమలుపై దృష్టి సారించారు. సూపర్ సిక్స్ హామీల్లో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం కూడా ఒకటి. ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ఈ దీపావళి నుంచి ప్రారంభిస్తామని ఇప్పటికే సీఎం చంద్రబాబు ప్రకటించారు. రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులకు ఏటా 3 సిలిండర్ల ఉచితంగా ఇస్తారు. ఒక్కో సిలిండర్ ధర రూ.837 ఉండగా.. ఏటా రూ.2,511 ఆదా అవుతుంది. సీఎం ప్రకటనతో అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీపం, ఉజ్వల పథకం, రాష్ట్ర ప్రభుత్వ పథకాల కింద కనెక్షన్లు ఉన్న 75 లక్షల మందికి ఈ పథకం అమలు చేస్తే ఏడాదికి రూ.1.763 కోట్ల ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ఏటా ప్రభుత్వంపై ఎంత భారం పడుతుందో అని నివేదిక సిద్ధం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఈ తరహా పథకాల అమలుపై పౌర సరఫరాల శాఖ అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదించనున్నారు. దీనిపై మంత్రుల కమిటీ భేటీ అయ్యి.. ప్రభుత్వానికి పలు సిఫార్సులు చేయనున్నారు.
Also Read: Tirumala News: బ్లాక్‌లో తిరుమల వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లు, వైసీపీ ఎమ్మెల్సీపై కేసు నమోదు