Heavy Rain alert for Andhra Pradesh | వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. అల్పపీడనం ప్రభావం, నైరుతి రుతుపవనాలు కారణంగా తెలుగు రాష్ట్రాల్లో రెండు, మూడు రోజుల నుంచి వర్షాలు దంచి కొడుతున్నాయి. ఒడిశాలోని చిలికా సరస్సుకు సమీపంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. దాని ప్రభావంలో ఏపీలో మరో రెండు, మూడు రోజులు వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాయుగుండం ఒడిశాలోని పూరీ తీరంలో గోపాల్ పూర్‌కు ఈశాన్యంగా 70 కి.మీల దూరంలో, నైరుతి దిశగా 40 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందన్నారు. వాయువ్యం దిశగా కదులుతూ ఒడిశా, ఛత్తీస్ గఢ్ వైపు వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. 


అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడే అవకాశం  
ఏపీలో ఆదివారం నాడు అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, విశాఖపట్నం, నెల్లూరు, అనంతపురం, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. 


ఎగువ నుంచి వస్తున్న వరదతో పాటు, భారీవర్షాల కారణంగా గోదావరికి వరద ప్రవాహం చేరుతోంది. ముందస్తుగా ప్రభావితం చూపే జిల్లాల అధికారులను అప్రమత్తం చేసినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు, వరద ప్రభావిత జిల్లాలకు రెస్క్యూ ఆపరేషన్, రిలీఫ్ ఆపరేషన్స్ కోసం రూ. 21.50 కోట్లు నిధులు మంజూరు చేశారు. సహాయక చర్యలకు మాడు ఎన్డీఆర్ఎఫ్ ( 1 కోనసీమ, 1 తూర్పు గోదావరి, 1 అల్లూరి జిల్లా), మూడు ఎస్డీఆర్ఎఫ్ ( 2 ఏలూరు, 1 అల్లూరి) బృందాలు పంపినట్లు  వెల్లడించారు.


గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు జాగ్రత్తలు


ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని పర్యవేక్షించి, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, వరద ఉధృతి ప్రభావం చూపే జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో సమన్వయ పరుచుకుని పనిచేయాలని సీఎం ఇదివరకే సూచించారు. గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఓబియమ్  బోట్స్, లైఫ్ బాయ్స్, లైఫ్ జాకెట్స్, రోప్స్, ఆస్కా లైట్ ఇతర రక్షణా పరికరాలతో సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. సహాయక చర్యల్లో అధికారులు అన్ని శాఖలవారు సహకరించుకోవాలని సీఎం చంద్రబాబు ఇదివరకే సూచించారు.
Also Read: క్రమంగా పెరుగుతున్న కృష్ణా ప్రాజెక్టుల్లోకి వరద - శ్రీశైలం ఎప్పటికి నిండుతుందంటే ?

చేపల వేటకు వెళ్లకూడదు, ఈ పనులు చేయొద్దు
వరదలతో వాగులు, వంకలు, నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని, రెండు మూడు రోజులపాటు చేపల వేటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరించారు. వరద నీటిలో ఈతకు  వెళ్ళడం, స్నానాలకు వెళ్ళడం, బోట్లు, స్టీమర్లలతో నదిలో ప్రయాణించడం కూడా చేయవద్దని, లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తగా సూచించారు. ఏమైనా అవసరం అయితే అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.