Rains In AP And Telangana: మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 22 నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది వాయుగుండంగా మారే ఛాన్స్ ఉందని పేర్కొంది. అయితే, ఎటు వెళ్తుంది అనే దానిపై స్పష్టత లేదని వెల్లడించింది. అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఉత్తర తమిళనాడు తీర ప్రాంతాన్ని ఆనుకొని ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి సగటున 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుందని.. ఎత్తుకు వెళ్లేకొద్దీ నైరుతి దిశగా వంగి ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరో ఆవర్తనం సైతం అండమాన్ సముద్ర ప్రాంతంలో సగటున సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉందని వెల్లడించారు. సోమవారం నాటికి అల్పపీడనం ఏర్పడేందుకు అవకాశం ఉందని.. ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణిస్తూ ఈ నెల 23న వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఏపీలో ఈ జిల్లాల్లో వర్షాలు
అల్పపీడనం ప్రభావంతో రాబోయే 3 రోజులు ఏపీలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదివారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, నంద్యాల, అల్లూరి సీతారామరాజు, విశాఖ, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. అటు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్ని చోట్ల ఆదివారం తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
తెలంగాణలో 4 రోజులు
మరోవైపు, తెలంగాణలోనూ మరో 4 రోజులు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో అక్కడక్కడ వానలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. సోమ, మంగళవారాల్లోనూ కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Also Read: Pawan Kalyan: జనసేనలోకి ముద్రగడ కుమార్తె - కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన జనసేనాని పవన్ కల్యాణ్