Chiranjeevi On Roja : సొంతూరికి ఏం చేయలేకపోవడం వల్లే మెగా బ్రదర్స్ ముగ్గురిని ప్రజలు ఓడించారని మంత్రి రోజా ఇటీవల విమర్శలు చేశారు. ముగ్గురికీ రాజకీయ భవిష్యత్ లేదన్నారు. ఈ వ్యాఖ్యలపై మెగా బ్రదర్ నాగబాబు రోజాపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాజాగా మంత్రి రోజాకు కౌంటర్ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి.  వాల్తేరు వీరయ్య ప్రమోషన్స్ లో ఉన్న చిరంజీవి రోజా వ్యాఖ్యలపై స్పందించారు. ఆమె చేసిన వ్యాఖ్యలపై తాను మాట్లాడాలనుకోవడం లేదన్నారు. తాను చేస్తున్న సేవలకు సీసీటీ, బ్లడ్‌బ్యాంక్‌, ఆక్సిజన్‌ బ్యాంక్ నిలువెత్తు నిదర్శనం అన్నారు.  ఆ టైంలో ఆమె అలా అనాల్సి వచ్చిందేమో అన్నారు. రోజా చేసిన వ్యాఖ్యల గురించి తాను ఏం మాట్లాడాలనుకోవడం లేదన్నారు.  రోజాతో ఎలాంటి మనస్పర్థలు లేవన్నారు. మంత్రి అయ్యాక కూడా ఆమె తన ఇంటికి వచ్చారని చిరంజీవి అన్నారు. 


ఎవరి కోసం ఇలా మాట్లాడుతున్నారు 


"రోజా వ్యాఖ్యలపై ఆమెనే అడగాలి. నేను ఎలాంటి సేవలు చేశానో, చేస్తున్నాను అనే సీసీటీ, బ్లడ్‌బ్యాంక్, ఆక్సిజన్‌ బ్యాంకులే నిలువెత్తు సమాధానాలు. కొందరు చేసే వ్యాఖ్యలకు సమాధానం చెప్పడం నా స్థాయిని నేనే తగ్గించుకున్నట్టు అవుతుంది. నేను రాజకీయాల్లో ఉన్నప్పుడైనా, ఇప్పుడైనా ఎదుటివారు చేసే విమర్శలపై స్పందించాలనుకోలేదు. ఎందుకంటే వాళ్లు నాతో పాటు చాలా కాలం నటించారు. కొందరైతే మా ఇంటికి వచ్చారు. నాతో కలిసి భోజనం చేశారు. వాళ్లంతా సొంత వారిలా కలిసి ఉన్నారు. ఇప్పుడు వాళ్ల ఇష్టం ప్రకారం  మాట్లాడుతున్నారు. ఆ వ్యాఖ్యలపై రియాక్ట్ అవ్వడం నా నైజం కాదు. ఎవరు ఏం మాట్లాడినా అది వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నాను. వాళ్లకు కౌంటర్ ఇచ్చి వాళ్లను తగ్గించి నా సెంటిమెంట్‌ను బ్రేక్ చేసుకోలేను. వాళ్లతో ఉన్న అనుబంధాన్ని పదిలంగానే ఉండాలని కోరుకుంటాను. ఇంకా వాళ్లు నా గురించి ఏం మాట్లాడతారో మాట్లాడనివ్వండి. ఎలాంటి లబ్ధి కోసం, ఎవరి కోసం వీళ్లు ఇలా మాట్లాడుతున్నారు? వీళ్లకు ఆ పరిణతి ఎప్పుడు వస్తుంది? రాజకీయాలంటే ఇలాగే ఉండాలా? అని అనిపిస్తుంది ఒక్కోసారి" - మెగాస్టార్ చిరంజీవి  


నాగబాబు కౌంటర్ 


మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసిన మంత్రి రోజాపై ఇటీవ జనసేన నేత, మెగా బ్రదర్ నాగబాబు సీరియస్ అయ్యారు. ముందు పర్యాటక శాఖ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. ఇన్ని రోజులు రోజా చేస్తున్న కామెంట్స్‌పై ఎందుకు స్పందించలేదో రీజన్ కూడా చెప్పారు. రోజా నోరు మున్సిపాలిటీ కుప్పుతొట్టే ఒకటేనంటూ కామెంట్ చేశారు. అందుకే ఇన్నిరోజులు ఏమీ అనలేదన్నారు. కావాలనే మున్సిపాలిటీ కుప్పతొట్టెను ఎవరూ కెలకరని.... అందుకే రోజా కామెంట్స్‌పై రియాక్ట్ కాలేదన్నారు. ప్రస్తుతం పర్యాటకంలో ఆంధ్రప్రదేశ్‌ 18వ స్థానంలో ఉందని... దాన్ని ఎలా పైకి తీసుకురావాలో రోజా ఆలోచిస్తే బెటర్ అన్నారు నాగబాబు. ఇలా మాట్లాడుతూ పోతే... రోజా పదవి నుంచి దిగిపోయేసరికి కచ్చితంగా 20వ స్థానానికి దిగజారుతుందని ఎద్దేవా చేశారు. పర్యటక శాఖను డెవలప్ చేయడమంటే... రోజా పర్యటనలు చేయడం కాదని వ్యంగ్యంగా స్పందించారు. ఈ శాఖను నమ్ముకొని వేల మంది జీవిస్తున్నారని వాళ్లందరి బాగు కోసం ఏదైనా చేయాలని సలహా ఇచ్చారు.