Pawan Kalyan : జనవరి 12న శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో యువశక్తి పేరిట భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని జనసేన పార్టీ ఇప్పటికే ప్రకటించింది. ఈ సభకు సంబంధించిన యువశక్తి గోడపత్రికను జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోమవారం ఆవిష్కరించారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జనవరి 12న భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నామని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. రాష్ట్రంలోని యువత గళం వినిపించేలా ఈ సభ ఏర్పాటు చేస్తున్నామన్నారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం వేదికగా యువశక్తి సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పవన్ పిలుపునిచ్చారు.  






మన యువత, మన భవిత 


గోడపత్రిక ఆవిష్కరణ అనంతరం మాట్లాడిన పవన్... స్వామి వివేకానంద స్ఫూర్తితో రణస్థలంలో యువశక్తి తడాఖా చూపించబోతుందన్నారు. జనసేన నిర్వహిస్తున్న ఈ సభకు యువతీ, యువకులు అందరూ ఆహ్వానితులే అన్నారు. మన దేశ వెన్నుముక యువత అన్నారు. ఉత్తరాంధ్ర వాసుల వలసలు, ఉపాధి, విద్యావకాశాలు, వ్యాపార అవకాశాలు, ఇతర సమస్యలపై యువత అభిప్రాయాలు తెలియజేసేందుకు ఈ భారీ బహిరంగ సభ వేదిక కానుందన్నారు. ఉత్తరాంధ్ర పరిస్థితులు, సమస్యలతోపాటు కష్టాల నుంచి విజయాలు సాధించిన వారి గొప్ప స్ఫూర్తిని ప్రపంచానికి చాటిచెప్పేందుకే యువశక్తి కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. "మన యువత, మన భవిత" అనేదే యువశక్తి కార్యక్రమం ప్రధాన నినాదం అన్నారు.  






యువత కోసమే సభ 


"ఉత్తరాంధ్ర యువత విద్యావకాశాలు, ఉపాధి అవకాశాల గురించి వలసలు వెళ్తున్నారు. ఇలాంటి సమస్యలు తెలుసుకునేందుకు వేదిక కానుంది యువశక్తి సభ. మా నుంచి మాత్రమే కాకుండా మీరే స్వయంగా మీ సమస్యలు చెప్పుకునేందుకు యువశక్తి సభ వేదిక కానుంది. వంది మందికి పైగా యువతీ, ,యువకులు ఈ సభలో వారి విజయగాథలు, కష్టాలు తెలియజేస్తారు. ఈ సభకు అందరూ ఆహ్వానితులే. ముఖ్యంగా యువతీయువకులు ఈ సభలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాను"- పవన్ కల్యాణ్ 


యువత సత్తా చాటేలా సభ 


ఉత్తరాంధ్ర కళా వైభవం ఉట్టిపడేలా, వారి సంప్రదాయాలు ప్రతిబింబించేలా.. యువత సత్తా చాటేలా జనసేన పార్టీ యువశక్తి కార్యక్రమాన్ని నిర్వహించనుందని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఇటీవల తెలిపారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర యువత కోసం వచ్చే జనవరి 12న రణస్థలంలో నిర్వహించనున్న యువశక్తి ఈవెంట్‌కు సంబంధించిన  పోస్టర్ ను ఇటీవల శ్రీకాకుళంలో నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించారు. కార్యక్రమ ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన పార్టీ నేతలతో కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు.