Jagan Kuppam Tour : ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి .. 22వ తేదీన చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనకు వెళ్తున్నారు. కుప్పంలో  వైయస్సార్‌ చేయూత పథకం మూడో విడత నిధులను విడుదల చేస్తారు.  ఉదయం 9.15 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరనున్న సీఎం, 10.45 గంటలకు కుప్పం చేరుకుంటారు. 11.15 – 12.45 గంటల మధ్య బహిరంగ సభలో పాల్గొని, వైయస్సార్‌ చేయూత పథకం మూడో విడత నిధులను విడుదల చేస్తారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకూ శంకుస్థాపన చేసే అవకాశం ఉంది. 


ఫస్ట్ టార్గెట్ కుప్పం అంటూ వైఎస్ఆర్‌సీపీ నేతల పోస్టర్లు 


కుప్పంలో గెలవాలని.. చంద్రబాబును ఓడించాలని జగన్ పట్టుదలగా ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలవాలని జగన్ దిశానిర్దేశం చేశారు. ఇటీవల నియోజకవర్గాల వారీ సమీక్షలను కూడా కుప్పంతోనే ప్రారంభించి పార్టీ నాయకలకు భరోసా ఇచ్చారు. అభ్యర్థిగా ఎమ్మెల్సీ భరతే పోటీ చేస్తారని .. అందులో సందేహం లేదని.. పులివెందులలానే కుప్పంను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. అప్పుడే కుప్పానికి రూ. 66 కోట్ల విలువైన అభివృద్ధి  పనుల మంజూరు చేస్తున్నట్లుగా ప్రకటించారు  


భారీ ఎత్తున జన సమీకరణకు సన్నాహాలు 


ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఎమ్మెల్సీ భరత్, జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాసులు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా జన సమీకరణ చేస్తున్నారు. దాదాపుగా పదిహేను వందల బస్సుల్లో జనాన్ని తరలించడానికి ఏర్పాట్లు చేసారు.  అధికారిక కార్యక్రమాల కోసం సీఎం జగన్ కుప్పం పర్యటనకు వెళ్తూండటం ఇదే ప్రథమం .  అందుకే వైఎస్ఆర్‌సీపీ నేతలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భారీ జనసమీకరణ చేసి... ఆదరణ తిరుగులేని విధంగా ఉందని చూపించాలనుకుంటున్నారు. వైఎస్ఆర్‌సీపీ నేతలు ఫస్ట్ టార్గెట్ కుప్పం పేరుతో నియోజకవర్గం మొత్తం పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ..పోస్టర్లు.. స్లోగర్లు రాశారు.  నియోజకవర్గ ఇంచార్జ్ భరతే  అయినప్పటికీ అన్ని వ్యవహారాలు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కసుసన్నల్లో జరుగుతూ ఉంటాయి. ఆయనే వైఎస్ఆర్‌సీపీ వ్యూహాలను ఖరారు చేస్తూంటారు.  కుప్పం నియోజకవర్గాన్ని జగన్ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో తెలుసు కాబట్టి జగన్ ఆలోచనలకు అనుగుణంగా పెద్దిరెడ్డి వ్యూహాలు ఖరారు చేస్తున్నారు. 


కుప్పం టీడీపీ ముఖ్య నాయకులందరూ జైల్లోనే !


కొద్ది రోజుల కిందట  టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మూడు రోజులపాటు కుప్పంలో పర్యటించారు. కుప్పం పర్యటనలో భాగంగా గతంలో ఎన్నడూ లేనివిధంగా దాడులు జరిగాయి. పలువురు టీడీపీ నేతలు అరెస్ట్ చేశారు.వారికి ఇప్పటికీ బెయిల్ లభించలేదు. కుప్పం నియోజకవర్గానికి చెందిన దాదాపుగా అరవై మంది టీడీపీ ముఖ్య నేతలు జైల్లోనే ఉన్నారు. లోకేష్ , చంద్రబాబు వారిని పరామర్శించారు.  సీఎం వైఎస్ జగన్ కుప్పంపై ఫోకస్ పెట్టడం.. ఎట్టి పరిస్థితుల్లో కుప్పంలో టీడీపీ జెండా మళ్లీ ఎగురేయాల్సిందేనని చంద్రబాబు  పట్టుదలగా ఉన్న సమయంలో ఆ నియోజకవర్గ రాజకీయం  హాట్ టాపిక్‌గా మారుతోంది.