Home Minister of AP: మహిళా భద్రత  కోసం ఏపీ ప్రభుత్వం కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది.  లైంగిక వేధింపులు అరికట్టేందుకు, పని ప్రదేశాలలో వారికి రక్షణ కల్పించేందుకు కొత్తగా శక్తి యాప్‌  తీసుకొస్తున్నామని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర   హోంశాఖ మంత్రి అనిత  అసెంబ్లీలో ప్రకటించారు.    మహిళా దినోత్సవం  రోజున యాప్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభిస్తారు.  మహిళలపై లైంగిక వేధింపులు, దిశ చట్టంపై శాసనమండలిలో వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి  అడిగిన ప్రశ్నకు అనిత  సమాధానమిచ్చారు. 


దిశ చట్టం పేరుతో విస్తృత ప్రచారం చేశారు కానీ దానికి చట్టబద్ధత ఉందో లేదో చెప్పాలని అనిత వైసీపీ సభ్యులను ప్రశ్నించారు. శక్తి  యాప్‌లో   పని ప్రదేశాల్లో మహిళల భద్రత కోసం 2013 పీఓఎస్‌హెచ్ చట్టం అమలు చేస్తామన్నారు.మహిళల రక్షణే ధ్యేయంగా ప్రతి ఫిర్యాదుపై కేసు నమోదు చేసే వ్యవస్థ అమలు చేస్తున్నట్లు తెలిపారు. స్త్రీ,శిశు సంక్షేమ శాఖ పని ప్రదేశాల్లో చట్టపరమైన పరిణామాల అవగాహన కోసం అవగాహన కల్పిస్తున్నామని హోంమంత్రి ప్రకటించారు. వైసీపీ తెచ్చిన దిశ యాప్ తో మగవాళ్లకు మాత్రమే ప్రయోజనం కలిగిందని ఒక్క మహిళను కూడా ఆపదలో ఉన్నప్పుడు రక్షించలేదన్నారు. శక్తి యాప్ నెట్ వర్క్ లేని చోట కూడా పని చేస్తుందని తెలిపారు. 


వైఎస్ఆర్‌సీపీ హయాంలో దిశ చట్టాన్ని తీసుకు వచ్చారు. హైదరాబాద్ లో దిశ ఘటన జరిగినప్పుడు.. ఏపీలో సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆడబిడ్డలపై ఆఘాయిత్యాలకు పాల్పడితే ఉరి శిక్ష వేస్తామని ఓ చట్టాన్ని తీసుకు వచ్చారు. ఆ చట్టం పేరుతో పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. అయితే ఆ చట్టానికి కేంద్రం ఆమోద ముద్ర వేయలేదు. అవి చాలా వరకూ కేంద్రం చేసిన చట్టాలకు భిన్నంగా ఉండటంతో వెనక్కి పంపారు. చట్టాలను కేంద్ర ప్రభుత్వమే చేయాలి. రాష్ట్రం కూడా చేయవచ్చు కానీ ఆ చట్టాలకు అనుగుణంగానే ఉండాలి. ఈ కారణంగా దిశ చట్టం అనేది అమల్లోకి రాలేదు. అయితే దిశ చట్టం అమల్లోకి వచ్చిందని ఉరి శిక్షలు కూడా వేశామని అప్పటి హోంమంత్రి గా ఉన్న సుచరిత ప్రకటించడం వివాదాస్పదం అయింది.                   


అదే సమయంలో దిశ యాప్ ను కూడా తీసుకు వచ్చారు. ఏపీలోని ప్రతి ఒక్కరి ఫోన్ లో దిశ యాప్ ఉండాలని పోలీసులు పట్టుబట్టి డౌన్ లోడ్ చేయించారు. ఎవరైనా ఆపదలో ఉంటే.. యాప్ ఓపెన్ చేసి రెండు సార్లు షేక్ చేసినా పోలీసులు వచ్చేలా యాప్ ను రూపొందించారు. అయితే ఆ యాప్ వల్ల పెద్దగా ఉపయోగం లేదన్న విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ప్రభుత్వం మరింత ఎక్కువ సర్వీసులు అందించేలా కొత్తగా శక్తి యాప్ ను అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. మహిళా దినోత్సవం నాడు ఆవిష్కరించనుంది.       



Also Read: శ్రీకాకుళం నుంచి అనంత వరకు పోసానిపై నమోదైన కేసులు చిట్టా ఇదే!