Driver Subramaniam murder case Investigation:  ఎమ్మెల్సీ అనంతబాబుకు హైకోర్టులో  ఊరట దక్కలేదు.  డ్రైవర్‌ను హత్య చేసి డోర్ డెలివరీ చేసిన కేసులో పునర్విచారణ వద్దని అనంతబాబు పిటిషన్ దాఖలు చేశారు.  ఈ కేసును పునర్విచారణ చేయాలని రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని కోరారు.  అనంతబాబు వేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది.  హైకోర్టు స్టేకు నిరాకరించడంతో పునర్విచారణకు   అడ్డంకులు తొలగిపోయినట్లయింది. 

అనంతబాబు కేసులో ఇప్పటికే  ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని  నియమించింది. సిట్ అధికారులు విచారమ ప్రారంభించారు.  అనంతబాబుకు సహకరించినవారిపై SIT ఫోకస్ చేసింది.   90 రోజుల్లో విచారణ పూర్తి చేసి హత్య కేసులో ఉన్న కుట్ర అంతా బయట పెట్టాలని అనుకుంటున్నారు.  కేసు పూర్వాపరాలు తేల్చి, బాధితులకు న్యాయం చేసే విషయంలో సిట్ ఏ అవకాశాన్ని వదిలి  పెట్టకూడదని భావిస్తోంది. 2022 మేలో డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసి  వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డోర్ డెలివరీ చేశారు. తానే హత్య చేసినట్లుగా  అనంతబాబు అంగీకరించారు. 

అయితే  ఈ  కేసులో తదుపరి విచారణ జరగలేదు.  కేసు విషయంలో న్యాయం చేస్తామని, నిందితులను శిక్షిస్తామని ఎన్నికల సమయంలో కూటమి నేతలు బాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు. ప్రభుత్వం మారిన తర్వాత  మృతుడి తల్లి ఫిర్యాదుపై తదుపరి చర్యలు తీసుకున్నారు. ప్రత్యేక  న్యాయవాదిని నియమించి  మళ్లీ దర్యాప్తు కోసం న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.   కేసుపై లోతైన విచారణ చేయడంతోపాటు 90 రోజుల్లో సప్లిమెంటరీ చార్జిషీట్‌ దాఖలు చేయాలని ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది.  ఈ కేసులో న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావును న్యాయ సలహాదారుగా ప్రభుత్వం నియమించింది. 

గతంలో విచారణలో లోపాలను గుర్తించి....90 రోజుల్లో పూర్తి విచారణ పూర్తి చేసే దిశగా సిట్  ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించింది. అనంతబాబుకు నాడు గన్ మెన్లుగా ఉన్న వారిని ఇప్పటికే ప్రశ్నించింది.  నాడు ఏం జరిగింది..ఘటనలో ఎవరెవరు ఉన్నారు అనే విషయాలపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు.  ఒక్కడే హత్య చేసి, డెడ్ బాడీని తరలించే అవకాశం లేదని...సహకరించిన వారు ఎవరనేది  సిట్  తేల్చాల్సి ఉంది.   కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత చట్టబద్దంగా బాధిత కుటుంబానికి అందాల్సిన పరిహారం, ఆర్థిక సాయం ఇప్పటికే అందచేశారు.  ఎస్సీలపై జరిగిన నేరాల విషయంలో బాధిత కుటుంబాలకు ఇవ్వాల్సిన పింఛను పెండింగ్ తో సహా చెల్లించింది.  కుటుంబ సభ్యులకు పింఛన్ తో పాటు డ్రైవర్ సుబ్రహ్మణ్యం సోదరుడుకి సోషల్ వెల్ఫేర్ శాఖలో ఉద్యోగం ఇచ్చారు.   ఇంటి నిర్మాణం కోసం అనువైన చోట 3 సెంట్ల ఇంటి స్థలం, 2 ఎకరాల సాగుభూమి ఇచ్చేందుకు ఉత్తర్వులు జారీ చేశారు.                   

అనంతబాబు ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం ప్రయత్నించారు. ఇప్పుడు  జగన్ సమక్షంలో జరిగే సమావేశాలకు హాజరవుతున్నారు.