MLA Daggupati Venkateswara Prasad | అనంతపురం:  టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ నివాసం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు (NTR Fans) ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించడానికి వస్తారని సమాచారంతో పోలీసు శాఖ అప్రమత్తమైంది. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఇంటి పరిసర ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి, రహదారులపై కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రెండు అంచెలుగా బారికేడ్లు ఏర్పాటు చేయడంతో స్థానికంగా ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా వారిని ఆపి తనిఖీ చేస్తున్నారు. 

ఆడియో వివాదంపై ఎన్టీఆర్ అభిమానులకు సారీ చెప్పిన ఎమ్మెల్యే

వార్ 2 సినిమా విడుదలైన సమయంలో కొన్ని రోజుల కిందట టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసినట్లుగా ఆడియో లీక్ అయింది. లోకేష్ బాబుపైనే కామెంట్స్ చేస్తావా.. అనంతపురంలో ఎన్టీఆర్ వార్ 2 సినిమా ఎలా ఆడుతుందో చూస్తానని అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ కామెంట్ చేశారని ప్రచారం జరిగింది. అయితే తనకు ఆ ఆడియోకు సంబంధం లేదన్న ఎమ్మెల్య.. ఎన్టీఆర్ అభిమానులకు సారీ చెబుతూ వీడియో విడుదల చేశారు.

సద్దుమణగని వివాదం, కర్ణాటక నుంచి వస్తున్న ఫ్యాన్స్

కానీ ఎన్టీఆర్ అభిమానులు ఇంకా శాంతించినట్లు కనిపించడం లేదు. ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఇంటిని ముట్టడించేందుకు అనంతపురం వైపు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తరలివస్తున్నారన్న సమాచారంతో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. పామిడి వద్ద అభిమానులను అడ్డుకుని పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మొత్తం మూడు చోట్ల ఎన్టీఆర్ అభిమానులను అడ్డుకున్నట్లు సమాచారం.

ఎన్టీఆర్ పై అనుచిత వ్యాఖ్యల ఆడియో వివాదం తెలుగు రాష్ట్రాలను దాటి కర్ణాటక వరకు చేరింది. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ వ్యాఖ్యలపై అఖిల కర్ణాటక ఎన్టీఆర్ సేవా సమితి సభ్యులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం చలో కార్యక్రమంలో పాల్గొనడానికి 8 వాహనాల్లో 40 మందికి పైగా అభిమానులు బయలుదేరగా, వారిని సరిహద్దు వద్దే ఏపీ పోలీసులు ఆపేశారు.

ఎక్కడికక్కడ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అరెస్ట్

విడపనకల్లు చెక్‌పోస్టు వద్ద కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు బసవరాజుతో పాటు 30 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విడపనకల్లు, ఉరవకొండ పోలీస్ స్టేషన్లకు తరలించారు. దీంతో అనంతపురంలో పలుచోట్ల ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు అడ్డుకుంటున్నా, వారిస్తున్నా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అవేమీ పట్టించుకోకుండా ముందుకు కదులుతున్నారు. దాంతో పలుచోట్ల పోలీసులు ఎక్కడికక్కడ ఎన్టీఆర్ అభిమానులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.

ఎమ్మెల్యేపై సీఎం చంద్రబాబు ఆగ్రహం..

వాస్తవానికి ఈ విషయం ఏపీ సీఎం చంద్రబాబు వరకు వెళ్లింది. పార్టీ పనులు, ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రజల పనుల్లో భాగస్వాములు కావాలి కానీ పార్టీకి తలనొప్పిగా మారితే సహించేది లేదని దగ్గుబాటి ప్రసాద్ తో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారని సమాచారం. ఆడియో లీక్ తరువాత ఎన్టీఆర్ ఫ్యాన్స్ టీడీపీ ఎమ్మెల్యేపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. నాలుగు గోడల మధ్య బహిరంగంగా ఎన్టీఆర్ కు సారీ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో అనంతపురంలోని ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ నివాసాన్ని ముట్టడించేందుకు ఏపీలోని పలు ప్రాంతాలతో పాటు కర్ణాటక నుంచి పెద్ద సంఖ్యలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరలివస్తున్నారు.