Floods In Water Projects: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలతో ప్రాజెక్టులకు వరద భారీగా చేరుతోంది. విజయవాడలో (Vijayawada) కృష్ణమ్మ ఉగ్రరూపం కాస్త శాంతించింది. అటు, గోదావరికి వరద ప్రవాహం మరింత పెరుగుతోంది. ఏపీ, తెలంగాణల్లోని ప్రధాన ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. ధవళేశ్వరం వద్ద ప్రస్తుత నీటి మట్టం 11 అడుగులుగా నమోదైంది. ఇక్కడి నుంచి సముద్రంలోకి దాదాపు 8.80 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. అటు, భద్రాచలం వద్ద కూడా గోదారమ్మ ఉగ్ర రూపం కొనసాగుతోంది. 44.3 అడుగుల నీటి మట్టం ఉండగా.. మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. 9,74,666 క్యూసెక్కుల వరదను అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని.. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా అధికారులు సూచిస్తున్నారు.


ప్రకాశం బ్యారేజీ గేట్లకు మరమ్మతులు


మరోవైపు, ప్రకాశం బ్యారేజీ (Prakasam Barrage) వద్ద దెబ్బతిన్న గేట్ల మరమ్మతుల పనులు నిపుణుల పర్యవేక్షణలో సాగుతున్నాయి. బ్యారేజీ 67, 68, 69 నెంబర్ గేట్లకు మరమ్మతులు చేస్తున్నారు. ఇటీవల బ్యారేజీ 69వ గేట్ వద్ద పడవ ఢీకొని కౌంటర్ వెయిట్ దెబ్బతినగా.. ఇంజినీరింగ్ నిపుణులు, ఏపీ జలవనరుల శాఖ సలహాదారు కన్నయ్యనాయుడు పర్యవేక్షణలో బెకెమ్ ఇన్ ఫ్రా సంస్థ సిబ్బంది పనులు చేపట్టింది. కాగా, ఇటీవలే ప్రకాశం బ్యారేజీలో వరద ఉద్ధృతికి కొట్టుకొచ్చిన 4 బోట్లు ఢీకొని గేట్లు దెబ్బతిన్నాయి. 67, 68, 69 గేట్లకు రెండు బోట్లు అడ్డు పడడంతో వాటి నుంచి నీటి ప్రవాహం సక్రమంగా సాగలేదు. దీంతో బెకెమె ఇన్ ఫ్రా సిబ్బంది తొలుత 67, 69 గేట్లను మూసేసి ఆ తర్వాత పడవలను తొలగించనున్నారు. 7 రోజుల్లో బ్యారేజీ గేట్ల ఏర్పాటు పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నారు.


శ్రీశైలం గేట్లు మూసివేత


అటు, ఎగువ నుంచి శ్రీశైలం (Srisailam) జలాశయానికి వరద తగ్గుముఖం పట్టిన క్రమంలో అధికారులు ప్రాజెక్టు గేట్లను మూసేశారు. బుధవారం 6 గేట్లలో నీటిని దిగువకు విడుదల చేయగా.. మధ్యాహ్నానికి ఇన్ ఫ్లో తగ్గుముఖం పట్టింది. ఈ క్రమంలో అన్ని గేట్లనూ అధికారులు మూసేశారు. ఈ క్రమంలో మత్స్యకారులు చేపల వేటకు సిద్ధమయ్యారు. జూరాల క్రస్ట్ గేట్ల ద్వారా 1,05,870 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి ద్వారా 31,106 క్యూసెక్కులు, సుంకేశుల జలాశయం ద్వారా 17,916 క్యూసెక్కులు, హంద్రీ నుంచి 117 క్యూసెక్కుల నీరు విడుదలైంది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 883.90 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 209.1579 టీఎంసీలుగా ఉంది.


తెలంగాణలో ప్రాజెక్టులకు వరద


అటు, కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ జలాశయం నిండుకుండలా మారింది. ఎగువన కురుస్తోన్న భారీ వర్షాలతో భారీగా వరద చేరుతుండగా.. 3 గేట్లు ఎత్తి 15 వేల క్యూసెక్కుల నీటిని మంజీరా నదిలోకి విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 1,405 అడుగులు (17.802 టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం 1,404 అడుగులకు (17.079 టీఎంసీలు) చేరుకుంది. మరోవైపు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్ల మండలంలో తాలిపేరు మధ్యంతర ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. ఛత్తీస్‌గఢ్‌లో కురిసిన భారీ వర్షాలకు భారీగ ఇన్ ఫ్లో వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు 15 గేట్లు ఎత్తి 46 వేల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదులుతున్నారు. తాలిపేరుతో పాటు చింతవాగు, రోటెంత వాగులు సైతం ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి.


సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టుకు కూడా వరద పోటెత్తింది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండడంతో అధికారులు 9 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు 40,496 క్యూసెక్కులు వస్తుండగా.. 3,186 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. పూర్తిస్థాయి నీటిమట్టం 29.91 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 28.22 టీఎంసీల నిల్వ ఉంది. నీటి నిల్వ 523.60 మీటర్లకు గానూ 523.2 మీటర్ల వద్ద నీరు ఉంది.


Also Read: Vijayawada Floods: విజయవాడలో మళ్లీ వర్షం - నగరవాసుల ఆందోళన, ఆ నీళ్లు తాగొద్దంటూ అధికారుల హెచ్చరిక