Hyundai Aura: సాంప్రదాయ వాహనాలతో పోల్చితే దేశంలో ఎలక్ట్రిక్ కార్ల వినియోగం పెరుగుతోంది. అంతే స్థాయిలో CNG కార్లను కూడా ప్రజలు ఆదరిస్తున్నారు. ఈ కార్లు తక్కువ ఖర్చులో అధిక మైలేజీని అందించడం వల్ల జనాలు వీటిని కొనేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో గత కొన్ని సంవత్సరాలుగా సీఎన్‌జీ కార్ల సేల్స్ కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. విరివిగా ఛార్జింగ్ స్టేషన్లు లేకపోవడం, ఛార్జింగ్ చేయడానికి సమయం ఎక్కువ పడుతుండటంతో చాలా మంది CNG కార్లను ఇష్టపడుతున్నారు.


భారత్‌లో మారుతి సుజుకి CNG కార్లను ఎక్కువగా అందిస్తుంది. ఈ విభాగంలో మారుతికి ప్రధాన పోటీదారుగా హ్యుందాయ్ మోటార్స్ ఉంది. అయితే టాటా మోటార్స్ నుంచి కూడా సరసమైన ధరలో సీఎన్‌జీ కార్లు అందుబాటులో ఉన్నప్పటికీ ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలపైనే దృష్టి సారిస్తుంది. హ్యుందాయ్ విడుదల చేస్తున్న సీఎన్‌జీ కార్లలో డ్యూయల్ సిలిండర్ టెక్నాలజీని ప్రవేశపెడుతుంది. ఎక్స్‌టర్‌, గ్రాండ్ ఐ10 నియోస్‌ తర్వాత మరో కారులో ఈ టెక్నాలజీతో సీఎన్‌జీ కారుని విడుదల చేసింది. 


హ్యుందాయ్ ఆరా న్యూ హై-CNG వెర్షన్
ఇటీవల హ్యుందాయ్ ఆరా (Hyundai Aura) కాంపాక్ట్ సెడాన్‌ బేస్‌ వేరియంట్‌ ‘E’ని హై-సీఎన్‌జీ వెర్షన్‌లో విడుదల చేసింది. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తీసుకువచ్చి సర్‌ప్రైజ్‌ చేసింది. దీని ధరను రూ. 7,48,600 (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. ఈ కొత్త CNG మోడల్‌ కేవలం బేస్ వేరియంట్ (E)లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. హ్యుందాయ్ ఆరా భారత్‌లో ఇప్పటికే 2 లక్షల యూనిట్లను విక్రయించింది. ఈ సరికొత్త వెర్షన్‌  అమ్మకాలను మరింత పెంచుతుందని కంపెనీ భావిస్తోంది.


కొత్త హ్యుందాయ్ ఆరా CNG ఒకే వేరియంట్ మోడల్ అయినప్పటికీ అనేక ఫీచర్లతో వస్తుంది. దీని ముందు భాగంలో పవర్ విండోస్, సర్దుబాటు చేయగల డ్రైవర్ సీటు, వెనుక సీటు హెడ్‌రెస్ట్‌లను కలిగి ఉంటుంది. 8.89 సెం.మీ మల్టీ-ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లేలో స్పీడోమీటర్‌తో వస్తుంది. అంతే కాకుండా Z-ఆకారపు LED టెయిల్ ల్యాంప్‌లను అదనపు ఆకర్షణగా ఉంటాయి. 



సేఫ్టీ ఫీచర్లు


సేఫ్టీ కోసం, తాజా హ్యుందాయ్ ఆరా ఆరు ఎయిర్‌బ్యాగ్స్, అన్ని సీట్లకు 3-పాయింట్ సీట్ బెల్ట్స్‌, సీట్ బెల్ట్ రిమైండర్స్‌, ఎలక్ట్రానిక్ బ్రేక్ డిస్ట్రిబ్యూషన్ (EBD)తో కూడిన ABS, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్, స్పీడ్ అలర్ట్ సిస్టమ్, వెనుక పార్కింగ్ సెన్సార్‌లను అందిస్తుంది. ఈ ఫీచర్లు ప్రయాణికులకు సురక్షితమైన డ్రైవింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ని ఇస్తాయి.


హ్యుందాయ్ ఆరా, గ్రాండ్ i10 నియోస్, ఎక్స్‌టర్ మోడల్‌లలో కనిపించే Hy-CNG 1.2-లీటర్ బై-ఫ్యూయల్‌ పెట్రోల్ ఇంజిన్ ద్వారా పనిచేస్తుంది. ఈ ఇంజిన్ 6000 rpm వద్ద గరిష్టంగా 69 bhp శక్తిని మరియు 4000 rpm వద్ద 95.2 nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి వస్తుంది. ఇది ప్రతి కిలో CNGకి 28 కిమీ మైలేజీని అందిస్తుంది. ఈ కొత్త హ్యుందాయ్ ఆరా సీఎన్‌జీ మార్కెట్లో మారుతి సుజుకి డిజైర్ సీఎన్‌జీ, టాటా టిగోర్ సీఎన్‌జీలకు పోటీగా ఉంటుంది. సరసమైన ధరలో మంచి మైలేజీ, ప్రీమియం ఫీచర్లు కలిగిన కార్ల కోసం కోరుకుంటే ఇది మీకు బెస్ట్‌ ఆప్షన్‌ అవుతుంది.


Also Read: సింగిల్ ఛార్జ్‌తో 900 కిలోమీటర్లు - సూపర్ ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేయనున్న హ్యుందాయ్!