Heavy Rains In Telugu States: ఒడిశా తీరంలో అల్ప పీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. అల్పపీడనం వాయువ్య దిశలో కదిలి ఆదివారం ఉదయం ఒడిశా - ఛత్తీస్ గఢ్ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నట్లు పేర్కొంది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో ఏపీలోని ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాలో మోస్తరు వర్షాలు కురవనున్నాయి. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. విశాఖ, మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటారు, బాపట్ల, ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో మోస్తరు వర్షాలు మిగతా చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు.
గోదావరికి వరద
భారీ వర్షాలతో ధవళేశ్వరం వద్ద గోదావరి నీటిమట్టం 10.2 అడుగులకు చేరగా.. 1800 క్యూసెక్కుల నీటిని డెల్టా కాలువకు విడుదల చేస్తున్నారు. సముద్రంలోకి 5 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. గోదారి వరద ఉద్ధృతికి దేవీపట్నం మండలంగండి పోచమ్మ ఆలయం పూర్తిగా నీట మునిగింది. అటు, అల్లూరి జిల్లాలో వర్షాలతో రాకపోకలు స్తంభించాయి. చట్టి వద్ద జాతీయ రహదారి - 30పైకి శబరి నది వరద చేరగా.. ఏపీ, తెలంగాణ, చత్తీస్‍గఢ్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే, విజయవాడలో ప్రకాశం బ్యారేజీకి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. బ్యారేజీకి 11,459 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండగా.. 14 గేట్ల ద్వారా 10,150 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కాలువల ద్వారా మరో 1,309 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు, ఏలూరు జిల్లాలో పోలవరం ప్రాజెక్టుకు వరద పెరుగుతోంది. స్పిల్ వే వద్ద నీటిమట్టం 31.7 మీటర్లకు చేరింది. శ్రీశైలం జలాశయం గరిష్ట నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 817 అడుగులకు చేరింది.
తెలంగాణలో 3 రోజులు
అల్పపీడనం ప్రభావంతో రాగల 3 రోజుల్లో తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడకక్కడ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అలాగే, సోమవారం.. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. గడిచిన 24 గంటల్లో నిజామాబాద్ జిల్లా వేంపల్లెలో 18.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే, ముష్కల్ 12.5, అలూర్ 15, నవీపేట 11.8, రేంజల్ 11.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
భద్రాచలం వద్ద గోదారి ఉద్ధృతి
భారీ వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరికి భారీగా వరద చేరుతోంది. తాజాగా, భద్రాచలం వద్ద నీటిమట్టం 41.30 అడుగులకు చేరుకుంది. నీటిమట్టం 43 అడుగులు దాటితే తొలి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ప్రస్తుతం ఎగువన కురిసే భారీ వర్షాలతో గోదావరి నీటిమట్టం పెరిగే అవకాశం ఉంది.