Vangalapudi Anita Comments on YS Jagan: జగన్ మోహన్ రెడ్డి నంగనాసి కబుర్లు మాట్లాడుతుంటే, విడ్డూరంగా ఉందని ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత ఎద్దేవా చేశారు. దేశంలో అంబేడ్కర్ రాజ్యాంగం అమలు అవుతుంటే జగన్ సీఎం అయ్యాక రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేశారని విమర్శించారు. ఇప్పుడు కూడా జగన్ మోహన్ రెడ్డి శవ రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వినుకొండలో వర్గ విభేదాలు కారణంగానే హత్య జరిగిందని అన్నారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్ లో వంగలపూడి అనిత మీడియా సమావేశం నిర్వహించారు.


ఈ సందర్భంగా వైఎస్ జగన్ పై వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘జగన్ చెబుతున్న 36 రాజకీయ హత్యలకు డేటా ఉందా? డేటా లేకపోతే జగన్ మోహన్ రెడ్డిపై ఎందుకు చర్యలు తీసుకోకూడదు. జగన్ మోహన్ రెడ్డి చెప్పినవి అన్ని అబద్దపు లెక్కలు. మేము అధికారంలోకి వచ్చాక రాజకీయ హత్యలు కేవలం నాలుగు మాత్రమే జరిగాయి. ముగ్గురు టీడీపీ వాళ్ళే చనిపోయారు. 36 హత్యలు అని చెప్పి, ప్రజలను భ్రయబ్రాంతులను చేయాలని ప్రయత్నం చేస్తున్నారు.


జగన్ మోహన్ రెడ్డి అధికారం లేక తహతహలాడుతున్నారు. చంపుకోవడం అనేది తప్పు. చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటున్నాము. జగన్ మోహన్ రెడ్డి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేసారు. గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే వేధించారు. గతంలో పెట్టిన కేసులపై బాధితులు కోర్టు చుట్టూ ఇంకా తిరుగుతున్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని జగన్‌ చెబుతున్నారు. అధికారం కోల్పోయిన నెల రోజులకే ఆయన మైండ్‌ పనిచేయట్లేదు.


వివేకానంద రెడ్డి హత్య గురించి జగన్ మోహన్ రెడ్డి మాట్లాడాలి. ఏదో రకంగా ప్రభుత్వంపై బురద జల్లాలని చూస్తున్నారు. "జగన్ మోహన్ రెడ్డి నీకు దమ్ము ఉంటే అసెంబ్లీకి రా. అసెంబ్లీలో అన్ని చర్చించుకుందాం. ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తే,చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఐదు సంవత్సరాలుగా గంజాయిని రాష్ట్ర పంటగా పండించారు’’ అని వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు.