Heavy Rains In AP | విశాఖపట్నం: వాయవ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం మంగళవారం ఉదయం ఒడిశా- ఉత్తర కోస్తా సమీపంలో గోపాల్‌పూర్ వద్ద తీరం దాటింది. తీర ప్రాంతాల్లో 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. వాయుగుండం ప్రభావంతో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఏపీలోని శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మిగతా కోస్తా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.
మత్స్యకారులకు అధికారుల హెచ్చరికలు
మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు. వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా, ఛత్తీస్‌గఢ్ వైపు పయనిస్తూ వాయుగుండం బలహీనపడుతోందని తెలిపారు. నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తీరం వైపు వెళ్లకూడదని సూచించారు. భారీ వర్షాలతో ఇటీవల ఏపీలోని పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ఇచ్చారు. నేడు సైతం శ్రీకాకుళం జిల్లాలో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఏమైనా సాయం కావాలంటే శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నెంబర్ 08942 240557కు ఫోన్ చేయాలని సూచించారు.
ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం
భారీ వర్షాలతో కృష్ణా, గోదావరి నదులకు వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణానదికి వరద పెరుగుతోంది. మంగళవారం ఉదయం ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 3.25 లక్షల క్యూసెక్కులు కాగా, ఇది 5 లక్షల క్యూసెక్కులు వరకు చేరే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మధ్యాహ్నంలోపు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. ప్రభావిత జిల్లాల్లో అధికారులు అప్రమత్తం అయ్యారు. శ్రీశైలం డ్యామ్ నుండి ఉదయం 5.5 లక్షల క్యూసెక్కుల వరద నీటి విడుదల చేశారు.
రాజమహేంద్రవరం వద్ద గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ధవళేశ్వరం వద్ద నీటి మట్టం 10.5 అడుగులకు చేరింది. సముద్రంలోకి 8.23 లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. మరోవైపు భద్రాచలం వద్ద గోదావరికి వరద ఉధృతి పెరిగింది. మంగళవారం ఉదయం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 37.3 అడుగులకు చేరనట్లు సమాచారం. 40 అడుగులకు చేరితే ప్రమాదక హెచ్చరికలు జారీ చేసి సమీప ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేయనున్నారు.