Andhra Pradesh Harsha kumar on Supreme Court :  ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై మాజీ ఎంపీ హర్షకుమార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అంగీకరించే ప్రశ్నే లేదన్నారు.  వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అంగీకరించడం లేదని రాజమండ్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రకటించారు.  తెలుగుదేశం పార్టీ మందకృష్ణ మాదిగను పావులా వాడుకుందని..  సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగానికి లోబడకుండా ఇచ్చిందని ారోపించారు.  ఆర్టికల్ 351 షెడ్యూల్ కులాలకు ఉద్దేశించబడినదని గుర్తు చేశారు.  వర్గీకరణ  చేయడానికి పార్లమెంటుకు కూడా అధికారం లేదని స్పష్టం చేశారు.  రాష్ట్రపతికి, పార్లమెంటుకు లేని అధికారాలు సుప్రీంకోర్టుకు ఎక్కడివని ఆయన ప్రశ్నించారు.                    

  


సుప్రీంకోర్టు  తీర్పును తాము అంగీకరించడం లేదని హర్షకుమార్ స్పష్టం చేసారు.  ఈ తీర్పు మోడీ చంద్రబాబు కలిసి అడిన కుట్ర అన్నారు.  సుప్రీంకోర్టు ఈ తీర్పును ఫిబ్రవరిలోనే రిజర్వ్ చేసి పెట్టిందని..  
రామ్ జన్మభూమి, అయోధ్య, బాబ్రీ మసీదు తీర్పులలో జరిగిన కుట్రలో వర్గీకరణ విషయంలో కూడా జరిగిందని ఆరోపించారు.  ఇది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం అయితే...  నేను కాంగ్రెస్ పార్టీలో ఉండనని ప్రకటించారు.  తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఎలా తీర్మానం చేస్తారని హర్షకుమార్ ప్రశ్నించారు.  ఈ తీర్పు ఇచ్చిన ధర్మాసనములో ఎస్సీ ఎస్టీ జడ్జిలు లేరని.. మాదిగల ఉద్యోగాలు సంపదలు మాలలు దోచుకుంటున్నారని దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.  ఈ విషయంపై శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకులతో రాజమండ్రిలో సభ ఏర్పాటు చేస్తానని  ప్రకటించారు.                                 


ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పు  ఇచ్చింది. వర్గీకరణకు రాష్ట్రాలకు అధికారం కల్పిస్తూ తీర్పు వెలువరించింది. ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉందని కోర్టు స్ఫష్టం చేసింది. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం వర్గీకరణ చేపట్టేందుకు లైన్ క్లియర్ చేసింది. చీఫ్ జస్టిస్‌ చంద్రచూడ్ సహా ఏడుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు వెల్లడించింది. ఎస్సీ వర్గీకరణకు తాము అనుకూలమే అని ఇప్పటికే కోర్టుకి కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇవాళ కోర్టు తీర్పు వెలువరించింది. మొత్తం ఏడుగురు సభ్యులతో కూడిన ధర్మాసనంలో 6:1 మెజార్టీతో ఈ తీర్పు వెల్లడైంది.                      


ఎస్సీ వర్గీకరణ చేయాలని మందకృష్ణ మాదిగ మూడు దశాబ్దాలుగా పోరాడుతున్నారు. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు..దాదాపుగా అన్ని రాష్ట్రాల్లోనూ ఎస్సీ వర్గీకరణ డిమాండ్లు ఉన్నాయి. సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు ఉన్నాయి. వర్గీకరణ చేయాలని అన్న డిమాండ్ ఎంత ఉందో..వద్దన్న డిమాండ్ కూడా అంతే ఉంది. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా పోరాడతానని హర్షకుమార్ ప్రకటించడం సంచలనం సృష్టించే అవకాశం ఉంది.