Elections 2024 : మాచర్ల నియోజకవర్గంలో పాలవాయి గేటు పోలింగ్ కేంద్రంలో టీడీపీ నేతలు రిగ్గింగ్ చేశారని అందుకే ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేశారని గురజాల ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి స్పష్టం చేశారు. పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేసిన ఒక్క వీడియో మాత్రమే ఎందుకు బయటకు వచ్చిందని అన్ని వీడియోలు కూడా బయటపెట్టాలని డిమాండ్ చేశారు. పోలింగ్ స్టేషన్ లోపలే కాదు... బయట కూడా ఏం జరిగిందో తెలియాలన్నారు. పిన్నెల్లి దాడి ఘటనకు రెండు మూడు గంటల ముందు ఏం జరిగిందో వీడియో విడుదల చేయాలని కాసు మహేష్ రెడ్డి డిమాండ్ చేశారు.
వీడియోలన్నీ బయట పెట్టాలని కాసు మహేష్ రెడ్డి డిమాండ్
మాచర్లలోని అన్ని పోలింగ్ బూత్‌లలో కెమెరాలు పెట్టిందే అన్నీ తెలుసుకోవడానికి అని గురజాల ఎమ్మెల్యే చెప్పారు. మాచర్లలో పొరపాట్లు జరిగాయని తాము పది రోజులుగా చెబుతున్నామని ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. ఈసీ తమకు న్యాయం చేయాలని లేదంటే విశ్వసనీయత పోతుందని హెచ్చరించారు. తప్పు ఎవరు చేసినా శిక్షించాలని తాము స్పష్టంగా చెబుతున్నామన్నారు.
మాచర్లలో రిగ్గింగ్ జరిగిందనేది నిజం
మాచర్ల నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో రిగ్గింగ్ జరిగిందని తెలిపారు. రిగ్గింగ్ జరిగిందని తాము చెబుతున్నామని... జరగలేదని వారు నిరూపించాలని సవాల్ చేశారు. అధికారులను బదిలీ చేశారంటే పోలింగ్ నిర్వహణలో ఎవరు విఫలమయ్యారో తెలిసిపోతోందన్నారు. నలుగురైదుగురిని మేనేజ్ చేసి కేసులు పెట్టినంత మాత్రాన భయపడేది లేదన్నారు. కాబట్టి ఎన్నికల సంఘం అన్నింటిపై చర్యలు తీసుకోవాలన్నారు. మాచర్లలో అల్లర్లకు కారణం ఎవరు? ఎవరు రెచ్చగొట్టారు? తెలియాలంటే వీడియోలు బయటకు రావాలన్నారు.
ఈసీ చర్యలు తీసుకోకపోతే కోర్టుకె్ళ్తాం !
ఈసీ చర్యలు తీసుకోవాలని... లేదంటే తాము కోర్టుకు వెళతామని కాసు మహేష్ రెడ్డి ప్రకటించారు. జగన్ రెండోసారి సీఎం అయ్యాక ఈ ఘటనపై క్షుణ్ణంగా దర్యాఫ్తు జరిపిస్తామన్నారు. పిన్నెల్లికి కేసులు కొత్త కాదని... ఆయన భయపడే వ్యక్తి కాదన్నారు. టీడీపీ హయాంలో అక్రమ కేసులు పెడితే 2019లో ఆయన ప్రజాబలంతో గెలిచిన వ్యక్తి అన్నారు. జనం మద్దతు ఉన్న పిన్నెల్లి ఎన్నికల్లో ఎందుకు ఓడిపోతారు అని ప్రశ్నించారు.
ఈవీఎం ధ్వంసం కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరారీలో ఉన్నారు. ఆయనను అరెస్టు చేశారో లేదో స్పష్టత లేదు. ఆయన విదేశాలకు పారిపోయారని కూడా చెబుతున్నారు. నిజం మాత్రం స్పష్టత లేదు. రోజూ మీడియాతో మాట్లాడే పిన్నెల్లి ఇప్పుడు మీడియాతో మాట్లాడటం లేదు.