Dead Fishes in River: కేరళలోని కొచ్చిలో పెరియార్ నదిలో (Periyar River) వందలాది చేపలు చనిపోవడం సంచలనం సృష్టించింది. దగ్గర్లోనే ఇండస్ట్రీలు ఉన్నాయి. వాటి నుంచి వచ్చే వ్యర్థాలు నదుల్లో భారీ ఎత్తున కలుస్తున్నాయి. ఈ కారణంగానే చేపలు చనిపోయి ఉంటాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక మత్స్యకారులు ఎప్పటి నుంచో ఈ సమస్యపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండి పడుతున్నారు. ఎర్నాకులంలోని పెరియార్ నది ప్రమాదకర స్థాయిలో కలుషితమవుతోంది. అత్యంత అరుదైన మంచి నీటి చేపలన్నీ చనిపోతున్నాయి. పారిశ్రామిక వ్యర్థాలు కలవడం వల్ల నీళ్లు నల్ల రంగులోకి మారిపోతున్నాయి. మే 21వ తేదీన నదికి సమీపంలోని కొన్ని బండ్స్‌లో చేపలు కుప్పలు కుప్పలుగా కనిపించడం అలజడి రేపింది. భారీ వర్షాలు కురవడం వల్ల చనిపోయిన చేపలన్నీ బండ్స్‌లో ఇలా కనిపించాయి. 




ఈ ఘటనపై స్పందించిన కేరళ పారిశ్రామిక మంత్రి పి. రాజీవ్ విచారణకు ఆదేశించారు. అధికారులు అప్రమత్తమై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని తేల్చి చెప్పారు. సీసీ కెమెరాల్లోని ఫుటేజ్‌ని ఓ సారి పరిశీలించాలని, నదిలో పారిశ్రామిక వ్యర్థాలను కలుపుతున్నారని తెలిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. పెద్ద ఎత్తున కేజ్‌ ఫార్మింగ్ (Cage Farming) చేస్తున్న రైతులు లక్షలాది రూపాయలు నష్టపోతున్నారు. రైతులు చెబుతున్న లెక్కల ప్రకారం...రూ.5-20 లక్షల వరకూ ఈ చేపల పెంపకం కోసం పెట్టుబడులు పెట్టారు. రైతుల కంప్లెయింట్స్ ఆధారంగా అధికారులు అప్రమత్తమయ్యారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆఫీస్‌ ముందు రైతులు ఆందోళనలు చేపడుతున్నారు.