Guntur Stampede : టీడీపీ అధినేత చంద్రబాబు సభలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరికొందరు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గుంటూరులో టీడీపీ నిర్వహించిన ఎన్టీఆర్ జనతా వస్త్రాలు, చంద్రన్న కానుక పంపిణీలో తొక్కిసలాట చోటుచేసుకుంది. చంద్రబాబు సభ ముగిసిన తర్వాత  తొక్కిసలాట జరిగిందని టీడీపీ శ్రేణులు అంటున్నాయి.  గుంటూరు వికాస్‌నగర్‌లో ఉయ్యూరు ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ జనతా వస్త్రాలు, చంద్రన్న కానుక పంపిణీ చేపట్టారు. సుమారు 30 వేల మందికి ఇవ్వాలని నిర్వాహకులు భావించారు. ఈ కార్యక్రమానికి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చంద్రబాబు మాట్లాడి వెళ్లిపోయిన తర్వాత కానుకల పంపిణీ చేపట్టారు. చంద్రన్న కానుకల కోసం జనం ఒక్కసారి తోసుకురావడంతో తొక్కిసలాట జరిగింది. దీంతో ముగ్గురు మృతి చెందారు.  పలువురు అస్వస్థతకు గురైయ్యారు. వారిని గుంటూరు జీజీహెచ్‌, స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన వారిలో ఒకరు గుంటూరు ఏటీ ఆగ్రహారానికి చెందిన గోపిశెట్టి రమాదేవిగా పోలీసులు గుర్తించారు. నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగానే తొక్కిసలాట జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు. 



ముగ్గురు మృతి


గుంటూరులో వికాస్ నగర్ లో చంద్రబాబు సభలో మృతుల సంఖ్య పెరిగింది. తాజాగా మరో ఇద్దరు మృతి చెందినట్లు గుర్తించారు. దీంతో మృతి చెందిన వారి సంఖ్య ముగ్గురికి చేరింది. ఇదిలా ఉంటే పది రోజులగా టీడీపీ నేతలు ప్రచారం చేయడం వల్లే పెద్ద ఎత్తున మహిళలు వచ్చినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. నిర్వాహకులు సరైన ఏర్పాట్లు చేయలేదని మండిపడుతున్నారు.  సంక్రాంతికి చంద్రన్న కానుకలు ఇస్తామని టీడీపీ నేతల ప్రచారం కారణంగా సభకు పెద్ద ఎత్తున మహిళలను, వృద్ధులు వచ్చినట్లు తెలుస్తోంది. చంద్రబాబు సభ ముగిసిన తర్వాత  కానుకల కోసం మహిళలు ఒక్కసారిగా దూసుకురావడంతో తొక్కిసలాట జరిగింది. వృద్ధులు, మహిళలు కిందపడిపోవడంతో వారిని తొక్కుకుంటూ వెళ్లిపోయారు.  ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. 


గుంటూరు ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి


గుంటూరులో జరిగిన తొక్కిసలాట దుర్ఘటనపై ముఖ్యమంత్రి జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో పలువురు మరణించడం తనను కలచివేసిందన్నారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు.


కందుకూరు తొక్కిసలాటలో 8 మంది మృతి


నెల్లూరు జిల్లా కందుకూరులో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఇటీవల నిర్వహించిన సభలో కొందరు కార్యకర్తలు, అభిమానులు మురుగునీటి కాల్వలో పడిపోవడంతో అపశృతి చోటుచేసుకుంది. ఐదుగురు కార్యకర్తలు అక్కడికక్కడే చనిపోగా, మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స పొందుతూ మరో ముగ్గురు చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 8కు చేరింది. గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని చంద్రబాబు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. ఇలాంటి ఘటన జరగడం బాధాకరం అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన చంద్రబాబు, వారి ఫ్యామిలీస్‌కి టీడీపీ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. తమకు చెందిన ట్రస్టుల నుంచి వారి పిల్లల చదువులు లాంటి అవసరమైనన అన్ని సదుపాయాలు కల్పిస్తాం అన్నారు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు. టీడీపీ నేతలు కూడా ఆర్థిక సాయం అందించారు. ఇరుకు సంధులో సభ నిర్వహించడం వల్లే తొక్కిసలాట జరిగిందని వైసీపీ ఆరోపిస్తుంది.