Borugadda Anil Special Meals Video | గుంటూరు జిల్లా: విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఏడుగురు పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ ను పోలీసులు రెస్టారెంట్ కు తీసుకెళ్లడంపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. మంగళగిరి కోర్టు నుంచి రాజమండ్రి జైలుకు తరలించిన సమయంలో నిందితుడు బోరుగడ్డకు బిర్యానీ కోసం తీసుకెళ్లడం వివాదాస్పదమైంది. మార్గమధ్యలో ఏలూరులో బోరుగడ్డ అనిల్ అనిల్ రిక్వెస్ట్ మేరకు ఆయనను రెస్టారెంట్ కు తీసుకెళ్లారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఏడుగురు పోలీసులను ఎస్పీ సతీష్ కుమార్ సస్పెండ్ చేశారు.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చినా అదే తీరు
నేరారోపణలు ఉన్న వ్యక్తులపై ఉదాసీనంగా ఉండొద్దని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరిస్తున్నా కొంతమంది పోలీసులు తీరు మారటం లేదు. వైసీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్ లపై బూతులతో విరుచుకుపడి 17కేసుల్లో నిందితుడిగా ఉన్న వైసీపీ నేత అనిల్ బోరుగడ్డకు పోలీసులు రాచమర్యాదలు చేస్తున్నారు. అనిల్ ను ఈరోజు మంగళగిరి కోర్టులో హాజరు పరిచి తర్వాత రాజమండ్రి సెంట్రల్ తరలిస్తూ ఉండగా మార్గమధ్యంలో గన్నవరంలో ఓ రెస్టారెంట్లో విందు భోజనం పెట్టించారు.
రిమాండ్ ఖైదీకి కోరిన భోజనం పెట్టేందుకు ఓ పెద్ద రెస్టారెంట్ కి పోలీసులు తీసుకువచ్చిన వీడీయోలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. బోరుగడ్డ అనిల్ కు పోలీసులు చేస్తున్న వీఐపీ ట్రీట్మెంట్ ను కొంతమంది టీడీపీ సానుభూతిపరులు సెల్ ఫోన్ లో రికార్డు చేయగా పోలీసులు వారిపైనే ఘర్షణకు దిగటం సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యింది. బోరుగడ్డ అనిల్ కు విందుభోజనం పెట్టిస్తున్న వీడియోలను డిలీట్ చేయాలని టీడీపీ సానుభూతి పరులనుంచి పోలీసులు ఫోన్లు లాక్కుని మరీ విజువల్స్ ను డిలీట్ చేయించారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ తతంగాన్ని ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దాంతో స్పందించిన పోలీస్ ఉన్నతాధికారులు విధుల్లో నిర్లక్ష్యం వహించిన పోలీసులను సస్పెండ్ చేశారు.