ఈనెల 17న ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటి వద్ద ఘర్షణపై గుంటూరు ఎస్పీలు విశాల్ గున్నీ, ఆరిఫ్ హఫీజ్‌తో కలిసి డీఐజీ త్రివిక్రమ్ వర్మ వివరణ ఇచ్చారు. వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ చంద్రబాబుకు వినతిపత్రం ఇవ్వడానికే ఆయన ఇంటికి వెళ్లారని తెలిపారు. దాడి చేసే ఆలోచన ఆయనకు లేదన్నారు. ఎమ్మెల్యే జోగి రమేశ్ రాకపై పోలీసులకు ఎలాంటి సమాచారం లేదని డీఐజీ తెలిపారు. జోగి రమేశ్ ను కరకట్ట మొదటి గేట్ వద్దే అడ్డుకున్నామన్నారు. మాజీ సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి అని జరుగుతున్న ప్రచారం అవాస్తవమన్నారు. నిరాధారంగా మీడియాలో కథనాలు ప్రసారం అయ్యాయని డీఐజీ ఆరోపించారు. ఈ ఘటనలో ముందుగా జోగి రమేశ్ కారుపై దాడి జరిగిందన్నారు.
డీజీపీ లేరని తెలిసి కూడా
ఎమ్మెల్యే రమేశ్ కారుపైన, డ్రైవర్ పై చెప్పులు, రాళ్లతో కొందరు దాడి చేశారని డీఐజీ వీడియోలను ప్రదర్శించారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆఫీసులో లేరని తెలిసి కూడా ఆయన కార్యాలయం వద్ద 70 మంది హడావుడి సృష్టించారని డీఐజీ త్రివిక్రమ్ వర్మ తెలిపారు. వినతిపత్రం ఇవ్వడానికి వచ్చే విధానం ఇది ప్రతిపక్షనేతలు ఆరోపిస్తున్నారన్నారు. కరకట్ట ఘటనపై ఇరుపక్షాల ఫిర్యాదులపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
Also Read: Online Movie Ticket Issue: ఆన్ లైన్ టికెట్ వ్యవస్థ పెద్ద సమస్య కాదు.. నిర్మాత సి.కళ్యాణ్ కామెంట్స్..
అసలేం జరిగింది
టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కోడెల శివప్రసాద్ వర్ధంతి సభలో సీఎం జగన్, హోంమంత్రి సుచరితపై విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని వైసీపీ కార్యకర్తలతో కలిసి పెడన ఎమ్మెల్యే జోగి రమేశ్ చంద్రబాబు నివాసం వద్దకు వెళ్లారు. వీరిని బుద్ధా వెంకన్న సహా టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. ఆ సమయంలో ఘర్షణ చోటుచేసుకుంది. ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు జెండా కర్రలతో దాడి చేసుకున్నారు. పోలీసులు బారికేడ్లు పెట్టి ఇరు వర్గాలను నిలువరించే ప్రయత్నం చేశారు. కానీ ఎవరూ వెనక్కి తగ్గకపోవటంతో లాఠీఛార్జ్ చేశారు. ఈ సమయంలో జోగి రమేశ్, బుద్ధా వెంకన్న మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారి ఇరువర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. గొడవ మరింత పెరిగేలా ఉందని భావించిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి జోగి రమేశ్‌ను అరెస్టు చేశారు.