Guntur News : గుంటూరు మున్సిప‌ల్ కార్పొరేష‌న్ స‌మావేశాలు హాట్ హాట్ గా జ‌రిగాయి. కార్పొరేష‌న్ అధికారుల అవినీతిపై ఏకంగా అధికార నేత‌లే ఫైర్ అయ్యారు. కార్పొరేష‌న్ డిప్యూటీ మేయ‌ర్ అధికారుల అవినీతిపై ఆరోప‌ణ‌లు చేశారు. అంతే కాదు కార్పొరేషన్ లో టౌన్ ‌ప్లానింగ్ అధికారులు ఆరాచకాలు పెరిగాయ‌ని, వార్డులలో‌ ప్రజలకు అవసరం అయిన పనులు చేయకుండా నిబంధనలు సాకుగా చూపి తప్పుకుంటున్నారని మరో కార్పొరేటర్ ఆరోపించారు. నిబంధనల‌ పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురి‌చేస్తున్నారని, డ‌బ్బులు ఇచ్చిన వారికి నిబంధన‌లు సైతం ప‌క్కన పెట్టి ప‌నులు చేస్తున్నారని కార్పొరేట‌ర్లు ఆరోప‌ణ‌లు చేశారు. కార్పొరేట‌ర్లు చేసిన కామెంట్లకు ఎమ్మెల్యేలు కూడా సపోర్టు చేయడంతో ఈ విషయం మరింత హాట్ టాపిక్ గా మారింది. 


మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం 


గుంటూరు మున్సిపల్ ‌కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశానికి కార్పొరేటర్లతో పాటు, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా,  పశ్చిమ ఎమ్మెల్యే మద్దాల‌ గిరిధర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముస్తఫా మాట్లాడుతూ...తనపై కొంత మంది పనిగట్టుకొని దుష్ర్పచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. కార్పొరేషన్ కు సంబంధించిన కాంట్రాక్టులను తాను చేస్తున్నానని తప్పుడు ప్రచారం చేస్తున్నార‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు. వివిధ వార్డులలో పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో ప్రజల‌ ఇబ్బందులు పరిష్కరించేందుకు మాత్రమే తన బంధువుల‌ చేత వర్క్స్ చేయిస్తున్నానని చెప్పారు. సకాలంలో కాంట్రాక్టు వర్కులకు బిల్లులు చెల్లింపులు లేకపోవడంతో కాంట్రాక్టర్లు టెండర్లు కూడా వేయడం లేదన్నారు. రెండో డివిజన్ కార్పొరేటర్ మర్రి అంజలి టౌన్ ప్లానింగ్ విభాగంపై విమర్శలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా తన ఏరియాలో అపార్ట్‌మెంట్లు నిర్మిస్తుంటే టౌన్ ప్లానింగ్‌ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. తాను చెప్పినా లెక్కలేకుండా ఉన్నారని తెలిపారు. అదే 30 గజాల‌ స్థలంలో పేదలు నివాసం కోసం రేకుల‌‌ షెడ్డు నిర్మించుకుంటే నిబంధనల పేరు చెప్పి కూల్చి వేస్తామంటూ బెదిరింపుల‌కు గురిచేస్తున్నార‌ని అన్నారు. 


సేవకు ఇచ్చిన స్థలంలో వ్యాపారం 


నగరపాలక సంస్థ అధికారుల అవినీతికి అంతే లేకుండా పోతోందని నగర డిప్యూటీ మేయర్ వనమా బాలవజ్రబాబు ఆరోపించారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో టీపీఎస్ లక్ష్మణస్వామి బదిలీపై వెళ్లి మళ్లీ  రావడం అంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ప్రైవేట్ ఏజెన్సీ నిర్వాహకులతో లక్ష్మణస్వామి కుమ్మక్కయ్యారని ఆరోపించారు. తొలగించిన హోర్డింగ్లను, బోర్డులను కార్పొరేషన్ కార్యాలయంలో ఉంచాల్సిన వాటిని ప్రైవేట్ ఏజెన్సీల దగ్గరకు తీసుకెళ్ళిన ఫొటోలను, ఇతర ఆధారాలను వజ్రబాబు కౌన్సిల్ ముందుంచారు. రూ.30 కోట్ల స్థలాన్ని సేవ కోసం తీసుకున్న విద్యాసంస్థ వ్యాపారం చేస్తోందని, దీనిపై గత కౌన్సిల్లో ప్రస్తావించినా చర్యలు తీసుకోలేదని వజ్రబాబు ప్రశ్నించారు.  దీని కోసం ఒక అడ్వకేట్ ను  నియమించి స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని పట్టుబట్టారు. దీంతో కమిషనర్ కీర్తి చేకూరి, మేయర్ కావటి మనోహర్ నాయుడు స్పందించి అడ్వకేట్ నియామ‌కానికి గ్నీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇంజినీరింగ్ అధికారులు పనులు చేయకుండా పనులు జరిగినట్టు బిల్లులు పెట్టి డబ్బులు డ్రా చేసుకుంటున్నారని వజ్రబాబు ఆరోపించారు. 


ఇంజినీరింగ్ వర్కర్లు సచివాలయాలకు ఎటాచ్ 


అధికారులు చెప్పిన సమాధానంపై ఎమ్మెల్యే మద్దాల‌ గిరి కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికారులకు రూ.3 లక్షలు ఇస్తే పోస్టులు సృష్టిస్తారని డిప్యూటీ మేయర్ వజ్రబాబు ఆరోపించారు. ఇంజినీరింగ్ విభాగంలో 1066 మంది వర్కర్లు ఎక్కడ పనిచేస్తున్నారో తెలియదని ఎద్దేవా చేశారు. దీనిపై స్పందించిన కమిషనర్ వర్కర్లను సచివాలయాలకు ఎటాచ్ చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.


Also Read : AP Home Minister : ఎంపీ ఇచ్చిన ఫిర్యాదుపైనే విచారణ -ఎంపీ మాధన్ వీడియోపై ఏపీ హోంమంత్రి స్పందన !