CM Jagan on Stampede : గుంటూరులో జరిగిన తొక్కిసలాట దుర్ఘటనపై ముఖ్యమంత్రి జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో పలువురు మరణించడం తనను కలచివేసిందన్నారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. సీఎం జగన్ ఆదేశాలతో కలెక్టర్, ఎస్పీ సంఘటనా స్థలిని పరిశీలించారు. బాధితులకు సహాయచర్యలపై ఆరా తీశారు. ఘటన జరిగిన తీరుపై ఎస్పీ ఆరా తీస్తున్నారు. 






గవర్నర్ దిగ్భ్రాంతి 


గుంటూరులో జరిగిన తొక్కిసలాట ఘటనపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో పలువురు మరణించడం, కొందరు గాయపడటంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని గవర్నర్ అధికారులు సూచించారు. ఈ మేరకు రాజ్ భవన్ నుంచి ఒక ప్రకటన జారీచేశారు. 


గుంటూరు ఘటనపై సోము వీర్రాజు విచారం వ్యక్తం 


గుంటూరు టీడీపీ సభలో జరిగిన తొక్కిసలాటపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు  దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో పలువురు మరణించడం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలన్నారు. తరచుగా విషాదకర సంఘటనలు జరగడం ఆందోళన కలిగిస్తోందన్నారు. 


విచారణకు ఆదేశం


గుంటూరు తొక్కిసలాట ఘటనపై హోంమంత్రి తానేటి వనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మరణించిన వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు.  తొక్కిసలాట ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు హోంమంత్రి వనిత.


చంద్రబాబు సభలో తొక్కిసలాట


టీడీపీ అధినేత చంద్రబాబు సభలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరికొందరు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గుంటూరులో టీడీపీ నిర్వహించిన ఎన్టీఆర్ జనతా వస్త్రాలు, చంద్రన్న కానుక పంపిణీలో తొక్కిసలాట చోటుచేసుకుంది. చంద్రబాబు సభ ముగిసిన తర్వాత  తొక్కిసలాట జరిగిందని టీడీపీ శ్రేణులు అంటున్నాయి.  గుంటూరు వికాస్‌నగర్‌లో ఉయ్యూరు ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ జనతా వస్త్రాలు, చంద్రన్న కానుక పంపిణీ చేపట్టారు. సుమారు 30 వేల మందికి ఇవ్వాలని నిర్వాహకులు భావించారు. ఈ కార్యక్రమానికి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చంద్రబాబు మాట్లాడి వెళ్లిపోయిన తర్వాత కానుకల పంపిణీ చేపట్టారు. చంద్రన్న కానుకల కోసం జనం ఒక్కసారి తోసుకురావడంతో తొక్కిసలాట జరిగింది. దీంతో ముగ్గురు మృతి చెందారు.  పలువురు అస్వస్థతకు గురైయ్యారు. వారిని గుంటూరు జీజీహెచ్‌, స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన వారిలో ఒకరు గుంటూరు ఏటీ ఆగ్రహారానికి చెందిన గోపిశెట్టి రమాదేవిగా పోలీసులు గుర్తించారు. నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగానే తొక్కిసలాట జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు.